- గౌడ సంఘం మీటింగ్ కోసమా?
- పార్టీ మార్పు కోసమా?
- పురపాలక సంఘం నేతలతో సమావేశం
మన బలగం – కోరుట్ల
Ponnam Prabharar Minister Telangana: కోరుట్ల పట్టణానికి చెందిన బడా వ్యాపారి.. బీఆర్ఎస్ నేత ఇంట్లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్థానిక బీఆర్ఎస్ పార్టీ పురపాలక సంఘ నేతలతో సమావేశం కావడంపై ప్రాధాన్యత సంతరించుకుంది. గీతా కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసుకున్న మీటింగుకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన ఆయన గౌడ్ సామాజిక వర్గానికి చెందిన వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
పురపాలక వర్గాన్ని పార్టీ మార్చేందుకా.!?
బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుట్ల మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోగా.. అనూహ్యంగా ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ‘పవర్ పాలిటిక్స్’మొదలయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీ టికెట్ ఆశావహులు బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి ఊహించినట్లే ‘గోడ దూకుల్లు’ ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఈ క్రమంలో గత కొంత కాలంగా కోరుట్ల-మెట్‌పల్లి పురపాలక సంఘాలపై అవిశ్వాస తీర్మానం పెట్టి పీఠాలు పార్టీ మారేలా పావులు కదుపుతున్నట్టు చర్చలు జోరుగా సాగుతున్నాయి.
మున్సిపాలిటీపై కన్ను
కాంగ్రెస్ పార్టీ అధికార మార్పిడి జరిగిన కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలు జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకోవడంతో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ వర్గం ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఈ నేపథ్యంలోనే మండలాల్లో నుంచి కీలకమైన నేతలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ చేరికల సంఖ్య పెంచుకుంటూనే ఉంటుండగా.. ఈసారి కన్ను పురపాలకవర్గాలపై పడిందన్న చర్చ మొదలైంది.
పొన్నం పర్యటన దేనికోసం?
అనుకున్నట్టుగానే.. బుధవారం కోరుట్లలో సీనియర్ నేత బూరుగు రామస్వామి గౌడ్ (బీఆర్ఎస్) ఇంట్లో విందు సమావేశం చర్చానీయాంశమైంది. ఇదే రామస్వామి గౌడ్ దివంగత మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు హయాంలో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉండేవారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లపాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఆయన సహజంగానే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌కు మారారు. అతనిలాగానే చాలా మంది పుప్పాల ప్రభాకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భూమరెడ్డి, తదితర కీలకనేతలు కాంగ్రెస్‌లోనే ఉండేవారు. ఇప్పుడు మళ్లీ ‘పవర్ పాలిటిక్స్’లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ విందు సమావేశంలో హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
జోరందుకున్న ఊహాగానాలు
వీరితో పాటు మున్సిపల్ చైర్మన్ భర్త, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అన్నం అనిల్ కూడా మంత్రితో భోజనం చేయడం చర్చానీయాంశమైంది. అదేం కాదు.. మంత్రి కాబట్టి ప్రొటోకాల్ ప్రకారం స్థానిక పురపాలక సంఘం తరఫున హాజరై ఉంటారని, లేదా గౌడ్ సామాజిక వర్గ నేతలుగా కూడా హాజరై ఉంటారని పలువురు మరో రకంగా వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ‘పవర్ పాలిటిక్స్’ మరింత వేడెక్కనున్నాయన్న ముచ్చట్లు ఊపందుకున్నాయి.