- అందరి అభిప్రాయం మేరకే అభ్యర్థుల ఖరారు
- జెండా మోసిన వారిలో గెలుపు గుర్రాలకే అవకాశం
Pawar Ramarao Patel: నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తులు, పార్టీ కోసం పని చేసే వారిని గుర్తించి అందరి అభిప్రాయం మేరకే బీజేపీ అభ్యర్థులను ఖరారు చేస్తామని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. మంగళవారం భైంసా పట్టణంలోని ఎస్.ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో బాసర, లోకేశ్వరం, ముధోల్, తానూర్ మండలాల బీజేపీ నాయకులతో వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కలిసి కట్టుగా ఉండి అన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పార్టీ తప్పకుండా గుర్తింపు ఇస్తుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని జడ్పీటీసీలు, ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా ముందుకు సాగాలన్నారు. ప్రతి మండలానికి జడ్పీటీసీ అభ్యర్థులు ముగ్గురు చొప్పున ఖరారు చేసి పంపిస్తామన్నారు. ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక తీరు ఆదే విధంగా ఉంటుందన్నారు. సర్వే ఆధారంగా గెలుపు గుర్రాలకు టికెట్లు ఖరారు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
