- కలెక్టర్ చొరవతో స్పందించిన అధికారులు
- నిర్మాణాలను కూల్చివేసిన మున్సిపల్ అధికారులు
Officials crackdown on land encroachments in Nirmal: నిర్మల్‌లో ప్రభుత్వ భూముల ఆక్రమణ యథేచ్ఛగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇదే నేపథ్యంలో అధికారులు భూ బకాసురులపై కొరడా ఝళిపించారు. నిర్మల్ పట్టణంలోని దివ్యనగర్ అయ్యప్ప దేవాలయం ముందు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్చార్జికి చెందిన ఫంక్షన్ హాల్ ఉంది. ఫంక్షన్ హాలుకు అనుకుని ఉన్న సర్వే నెంబర్ 534లో ఉన్న ప్రభుత్వ భూమిని సదరు నేత ఆక్రమించినట్లు అధికారులకు పలు ఫిర్యాదులు అందాయి. ఇదే క్రమంలో ఫంక్షన్ హాల్‌ను ఆనుకుని నిర్మాణం చేపట్టారు. కాగా గతంలో ఉన్న ఫిర్యాదులకు తోడు స్థానిక ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు రంగప్రవేశం చేశారు. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు సిద్ధమైన తరుణంలో సదరు నేత వాదులాటకు దిగారు. ఐతే కలెక్టర్, ఎంఎల్ఏ సమక్షంలో అధికారులు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు.
సమగ్ర విచారణ జరపాలి
ఇదిలా ఉండగా ఈ సర్వే నెంబర్లో దాదాపు 20 ఎకరాల పైగా ప్రభుత్వ భూమి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో నుంచి వివిధ కుల సంఘాలకు, దేవాలయ పూజారులకు కొంత భూమిని కేటాయించారు. ఇది 10 నుంచి 12 ఎకరాల మేర ఉన్నా మిగతా భూమి ఎటు పోయిందన్న విషయం అంతు పట్టడం లేదు. ఈ నేపథ్యంలో అధికారులు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

