- మావోయిస్టు ఉద్యమంలో ప్రముఖులంతా నిర్మల్ జిల్లా వాసులే
Silent End of Maoist Legacy in Nirmal District: రాజకీయంగా, సామాజికంగా తెలంగాణ ప్రాంతంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నిజాం నిరంకుశ లకులను గడగడలాడించిన నాటి కొమురం భీం, రాంజీ గోండు నుంచి మొదలుకొని నేటి మావో ఉద్యమం వరకు ఈ ప్రాంతం ఉద్యమాలకు పురిటిగడ్డగా నిలిచింది.
ఉద్యమాల పురటి గడ్డ మూగబోయింది
ఉద్యమాలకు పెట్టిన పేరుగా ఉన్న నిర్మల్ గడ్డ మూగబోయింది. మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకులంతా నిర్మల్ జిల్లా వాసులే కావడంతో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు లభించింది. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావో ఉద్యమం మరుగున పడిపోయింది. నిర్మల్ జిల్లా నుంచి ఎందరో ప్రముఖులు మావో ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. అనేకమంది ఉద్యమకారులు ఎన్కౌంటర్లలో మృత్యువాత పడగా మరికొందరు లొంగిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
నేలరాలిన ఉద్యమకారులు
మావోయిస్టు ఉద్యమంలో వివిధ హోదాల్లో పనిచేసిన జిల్లా వాసులు పలు ఎన్కౌంటర్లలో మృత్యువాత పడ్డారు. జిల్లాలోని కడెం, ఖానాపూర్ మండలాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో అనేకమంది మావో ఉద్యమంలో పనిచేసిన వారు మృతిచెందారు. లక్ష్మణచందా మండల కేంద్రానికి చెందిన సూర్యం ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఆయన మావోయిస్టు ఉద్యమంలో ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా పనిచేశారు.
లొంగిపోయిన మావోయిస్టులు
మావోయిస్టు ఉద్యమంలో వివిధ హోదాల్లో పనిచేసి లొంగిపోయిన నిర్మల్ జిల్లా వాసులు ఉన్నారు. మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సారంగాపూర్ మండలానికి చెందిన సట్వాజి, నిర్మల్‌కు చెందిన మురళి, అజయ్ లొంగిపోయారు. తాజాగా మావోయిస్టు ఉద్యమంలో కేంద్ర కమిటీలో కీలక పాత్ర పోషించిన ఇర్రి మోహన్ రెడ్డి మహారాష్ట్రలో లొంగిపోవడంతో నిర్మల్ ఉద్యమాల పురిటిగడ్డ మూగబోయింది. నాలుగున్నర దశాబ్దాల కాలం పాటు ఉద్యమంలో పనిచేసిన మోహన్ రెడ్డి ఏ ఒక్కరోజు ఆయన మీడియా ముందుకు రాలేదు. ఆయనకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఆయన అజ్ఞాతవాసం లోనే ఉన్నారు. మావోయిస్టు ఉద్యమంలోనే ప్రతిష్టాత్మకమైన బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. ఇంతకాలం పాటు ఉద్యమంలో పనిచేసిన మోహన్ రెడ్డి లొంగుబాటుతో నిర్మల్ జిల్లాలో మావోయిస్టు ఉద్యమాలకు తెరపడింది. ఉద్యమంలో జిల్లాకు చెందిన మరో ఏకైక గిరిజన మహిళ ఉన్నట్లు సమాచారం. కడెం మండలం ఆలంపల్లి గ్రామానికి చెందిన గోశిబాయి ఎలియాస్ పార్వతి మావోయిస్టు ఉద్యమంలో ఉన్నట్లు సమాచారం.
