- మంచి సంకల్పంతో స్వయం సేవకులు పని చేస్తున్నారు
- ప్రతి వ్యక్తిలో దేశ భక్తి నిర్మాణం కావాలి
- హిందూ సమాజం శక్తిమంతమైనది
- ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల్లో ఎంతో కృషి చేసింది
- ఆర్ఎస్ఎస్ గ్రామస్థాయిలో ఏర్పాటు కావాలి
- టీవీ సీరియల్స్ ద్వారా కుట్ర జరుగుతోంది
- కార్యవాహక్ రాజులవార్ దిగంబర్
RSS centenary celebrations in Khanapur: భారతదేశం ప్రపంచానికి జగద్గురువు కావాలని ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ కార్యవాహక్ రాజులవార్ దిగంబర్ అన్నారు. ఆర్ఎస్ఎస్ ఏర్పాటై విజయదశమికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. పట్టణంలో స్వయం సేవకుల చేత ఉత్సవ పథ సంచలన్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. హిందూ సమాజం శక్తిమంతమైనదని, ఆర్ఎస్ఎస్ సంఘం వ్యక్తి నిర్మాణం ద్వారా హిందూ సంఘటితం చేస్తూ, హిందు సమాజాన్ని శక్తిమంతం చేస్తోందని తెలిపారు. హిందూత్వ వ్యాప్తికి వంద సంవత్సరాలుగా కృషి చేస్తోందని చెప్పారు. ప్రతి వ్యక్తిలో దేశభక్తి నిర్మాణం కావాలని పిలుపునిచ్చారు.
స్వయం సేవకులు దేశానికి ఏ ఆపద వచ్చినా, విపత్తు వచ్చినా, భూకంపం వచ్చినా, రైలు పడిపోయినా, ఆ సమయాల్లో ముందుండి కాపాడే ప్రయత్నం చేస్తారని తెలిపారు. అనేక సందర్భాల్లో చైనా, పాకిస్తాన్‌తో గెలవటానికి మన మిలటరీకి సహకరిస్తూ, దేశం గెలుపులో భాగస్వామ్యం అయ్యారని, సమాజం యొక్క సేవలో దాదాపు లక్షా 50 వేల మంది సేవా కార్యక్రమల్లో ఉన్నారని, విద్యా, వైద్యం వంట సేవలు అందించారని చెప్పారు. కులాలు, మతాల పేరుతో చిచ్చు పెడుతున్నారని, కులం ప్రధానం కాదని, గుణం ప్రధానమని పేర్కొన్నారు. స్వదేశీ వస్తువులు మాత్రమే కొని, దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని కోరారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని, కట్టు బొట్టు సంప్రదాయాన్ని కాపాడుకోవాలని సూచించారు.
అందరికీ విద్య అవసరం అని, తల్లిదండ్రులు పిల్లల విషయంలో శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని, కానీ మన పద్ధతులు మారుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. విదేశీ పద్ధతులు వద్దని, వృత్తిని కాపాడుకోవాలని, ప్రస్తుతం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదని, హిందూ సమాజం శక్తిమంతం కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాముడితో కలిసి సీత అడవికి వెళ్లిందని గౌరవానికి నిదర్శనం అని అన్నారు. నేడు టీవీ సీరియల్ ద్వారా హిందూ సమాజంపైన కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటివి గుర్తించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. దేశ సంస్కృతిని గురించి చెప్పాలని, హిదూ సమాజం మరింత బలం కావాలని, మంచి అలవాట్లు చేసుకువాలని, ప్రతి ఒక్కరిలోనూ దేశ భక్తి అవసరం అని, ఆర్ఎస్ఎస్ గ్రామ స్థాయిలో ఉంటేనే హిందూ సమాజం ఇంకా బలపడుతుందని, బలహీన దేశం ఉండవద్దని, భారత్ దేశం శక్తిమంతంగా ఉండి, దేశం కోసం పని చేసే గొప్ప వ్యక్తులుగా కావాలని పిలుపునిచ్చారు.

