RTC bus stolen: నిర్మల్, సెప్టెంబర్ 23 (మన బలగం): మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు దొంగిలించి అడ్డంగా దొరికిపోయాడు. ఇటీవలి కాలంలో దొంగలు చిత్ర విచిత్రంగా చోరీలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సునే కొట్టేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. మహారాష్ట్రకు చెందిన యువకుడు నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్ డిపోలో నుంచి అర్ధరాత్రి ఆర్టీసీ బస్సుతో ఉడాయించాడు. ఖాళీ బస్సును తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఆ బస్సుకు సోఫినగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు బస్సును అడ్డుకొని ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. స్థానికులు అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిపో నుంచి బస్సును చోరీ చేసి తీసుకువెళ్తుంటే సెక్యూరిటీ సిబ్బంది ఏం చేశారని పలువురు విమర్శిస్తున్నారు. ఏకంగా బస్సునే డిపో నుంచి తీసుకు వెళ్ళాడు అంటే సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది.