MP Vamsi krishna: ధర్మపురి, జనవరి 20 (మన బలగం): ధర్మపురి పట్టణాభివృద్ధికి కృషి చేయనున్నట్లు ఎంపీ వంశీక్రిష్ణ, విప్ లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మపురి మున్సిపాలిటీలో టీయూఎఫ్ఐడీసీ ద్వారా మంజూరైన రూ.15 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు సోమవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ వంశీ క్రిష్ణ, జిల్లా అదనపు కలెక్టర్, అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. 7వ వార్డులో రూ.30 లక్షలతో చిల్డ్రన్ పార్కు, ఇందిరమ్మ కాలనీ, నక్కలపేట కాలని, లక్ష్మీనరసింహ కాలనీలో రూ.20 లక్షలతో ఎంట్రెన్స్ అర్చ్, 3, 4వ వార్డులలో రూ.177.50 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, 7వ వార్డులో రూ.395.60 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, 11, 12, 13, 14 వార్డుల్లో రూ.244.00 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, 7వ వార్డులో ఎన్‌హెచ్ఎం ఫండ్ రూ.13 లక్షలతో బస్తీ దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీ క్రిష్ణ మాట్లాడుతూ తలాపున గోదావరి ప్రవహిస్తున్నా పట్టణంలో నీటిఎద్దడి సమస్య ఉండడం బాధాకరం అన్నారు. గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ, కాకతీయ పథకాలు ఉన్నా నీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. అమృత్ పథకం కింద రూ.2 కోట్లు తాగునీటి కోసం కేటాయిస్తున్నట్లు తెలిపారు. ధర్మపురి కరకట్ట నిర్మాణంపై కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధర్మపురి ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా రెండు సమస్యలు ఉన్నాయి, ఒకటి పవిత్ర గోదావరిలో మురుగు నీరు కలిసి గోదావరి కలుషితం కావడం, ఫ్లడ్ వాల్ లేకపోవడంతో వర్ష కాలంలో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని తెలిపారు. ఇప్పటికే గోదావరిలో మురుగు నీరు కలవకుండా ఒక సివరేజ్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.14 కోట్లు మంజూరుకు పరిపాలన అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.