- నిపుణుల సూచనలు.. నివారణ మార్గాలు
Symptoms of Dengue, Remedy: వర్షాకాలం ప్రారంభమైంది. వర్షానికి గుంతల్లో నీరు నిలిచి దోమలు వ్యాప్తి చెందుతాయి. దోమల కారణంగా వ్యాధులు ప్రబలుతాయి. వ్యాధుల బారినపడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వర్షకాలంలో ప్రధానంగా డెంగీ బారిన పడే ప్రమాదం ఉంది.
డెంగీకి బ్రేక్‌బోన్ ఫీవర్ అని మరో పేరు కూడా ఉంది. ఇది చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. సకాలంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశముంది. ఉష్ణ, ఉప ఉష్ణ మండల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ వ్యాధి ప్రబలడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. డెంగీ బారిన పడిన వెంటనే లక్షణాలు పెద్దగా కనిపించవు. అధిక జ్వరం వంటి సాధారణ లక్షణాలే ఉంటాయి. డెంగీ వ్యాధికి నిర్దష్టమైన చికిత్స విధానం అంటూ ఏదీ లేదు.
డెంగీ నుంచి అధిక శాతం రోగులు ఒకట్రెండురోజుల్లో కోలుకుంటారు. కొంత మందిలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధి నుంచి బయటపడవచ్చు.
డెంగీ లక్షణాలు
డెంగీ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించడం ఎంతో అవసరం. ముందస్తుగా గుర్తించడం ద్వారా సరైన చికిత్స పొందే అవకాశం ఉంటుంది. దీంతో ప్రాణాంతకంగా మారకుండా ఉంటుంది. వ్యాధిని గుర్తించడం ఆలస్యమయ్యే కొద్ది ప్రాణాంతంగా మారుతుంది.
డెంగీ జ్వరం ప్రారంభ లక్షణాలు ఫ్లూ లేదా ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే కనిపిస్తాయి. అయినా లక్షణాల గురించి తెలుసుకోవడం ఉత్తమం. రోజుల తరబడి వ్యాధి అలాగే ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.
డెండీ లక్షణాలు
అధిక జ్వరం (సాధారణంగా 104 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది)
తీవ్రమైన తలనొప్పి
కళ్ల మంటలు
కండరాలు, కీళ్ల నొప్పులు
వికారంగా ఉండడంతోపాటు వాంతులు చేసుకోవడం
ఉబ్బిన గ్రంథులు
శరీరంపై దద్దుర్లు రావడం
పొత్తికడుపులో నొప్పిగా ఉండడం
రక్తపోటు తగ్గడం
తల తిరుగుతున్నట్లు ఉండడం
స్పృహ తప్పి పడిపోవడం
వేగంగా శ్వాస తీసుకోవడం
అలసటగా ఉండడం
చిగుళ్లు, ముక్కు నుంచి రక్తస్రావం కావడం
ఆదుర్దాగా ఉండడం
వాంతి, మలంలో రక్తం రావడం
విపరీతమైన దాహం వేయడం
చలి, తేమతో కూడిన చర్మం
బలహీనంగా ఉన్నట్లు అనిపించడం
ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కోలుకున్న తరువాత చాలా వారాల పాటు అలసటగానే ఉంటుంది.
వ్యాధి ప్రారంభంలో కలిగే లక్షణాలు
దోమకాటు తరువాత 4 నుంచి 10 రోజుల్లో ప్రారంభ లక్షణాలు కనిపిస్తాయి. రెండు నుంచి ఏడు రోజులు అలాగే ఉంటాయి. పైన తెలిపిన లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలి.
0.5 నుంచి 5 శాతం మధ్య డెంగీ జ్వరం తీవ్రంగా మారుతుందని గణాంకాల ద్వారా తెలుస్తున్నాయి. లక్షణాలు అధికమైతే ప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది. జ్వరం సాధారంగా 99.5 నుంచి 104 డిగ్రీల వరకు తగ్గుతుంది. తీవ్రమైన లక్షణాలు ఒకటి రెండు రోజుల్లో బయటపడినా మూడు నుంచి ఏడు రోజుల్లో బయటపడుతుంది.
డెంగీ నివారణ మార్గాలు
డెంగీకి నిర్దిష్ట చికిత్స లేనందున దోమ కాటుకు గురికాకుండా ఉండడం ఉత్తమం. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి.
శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించాలి
ఇంట్లో దోమల నివారణకు మందులు వాడాలి
దోమ తెరలు వాడాలి
నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
కిటికీ, తలుపులకు తెరలు ఉపయోగించాలి
తెల్లవారుజామున, సాయంత్రం ఆరుబయటకు వెళ్లొద్దు
వైద్యులు డెంగీ వ్యాక్సిన్ సైతం సిఫారసు చేస్తున్నారు. భవిష్యత్తులో డెంగీ బారిన పడకుండా వ్యాక్సిన్ నిరోధిస్తుంది.