ration cards: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసే వారితోపాటు ఇదివరకే రేషన్ కార్డు కలిగి ఉన్నవారు పేర్లను సవరించుకునేందుకు రాష్ర్టవ్యాప్తంగా లక్షల్లో ఉన్నారు. దశాబ్దకాలంగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మూలనపడింది. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు? ఇదివరకే రేషన్ కార్డు ఉన్నవారు పేర్లు చేర్చుకునే వెసులుబాటు ఎప్పుడు కల్పిస్తారు? అని ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలు లబ్ధి పొందాలంటే రేషన్ కార్డు ప్రామాణికంగా చూస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ రేషన కార్డు ఉండాలని కోరుకుంటారు.
ప్రజాపాలనలో దరఖాస్తులు
రాష్ర్టంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించి అదిగో.. ఇదిగో అంటూ ఊరిస్తూ వస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో కొత్త రేషన్ కార్డుల కోసం సైతం అప్లై చేశారు. తాజా సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల జారీపై ప్రకటన చేయడంతో ప్రజల్లో ఆశలు చిగురించాయి.
రేషన్ దరఖాస్తుల కోసం కొత్త పోర్టల్
అయితే రేషన్ కార్డుల జారీకి సంబంధించి కొత్తగా పోర్టల్ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డులు సైతం త్వరలోనే జారీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రివర్గ సమావేశంలో ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం రాష్ర్ట వ్యాప్తంగా 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 55 లక్షలు కేంద్ర ప్రభుత్వం జారీ చేసినవి ఉన్నాయి. మిగతా 35 లక్షలు రాష్ర్టం జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేసే పోర్టల్ ద్వారా 10 లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేసింది. దశాబ్ద కాలం నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయినందున ఇంకా భారీగానే దరఖాస్తులు వచ్చే అవకాశముంది.
ఎడిట్ ఆప్షన్‌పై తప్పుడు ప్రచారం
రేషన్ కార్డుల్లో పేర్ల సవరణకు సంబంధించి కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మీ సేవ కేంద్రాల్లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగుతోంది. ఇదివరకే రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు కొత్త పేర్లు నమోదు చేసుకోవడం, మార్పులు వంటి వాటికి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. అయితే సవిల్ సప్లై అధికారులు మాత్రం ఇదంతా ఫేక్ అని కొట్టి పారేస్తున్నారు. ప్రభుత్వం అలాంటి ఉత్తర్వులు ఏమీ జారీ చేయలేదని స్పష్టం చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ కానీ, పేర్ల సవరణకు సంబంధించి ఎలాంటి దరఖాస్తులు స్వీకరించడంలేదని చెబుతున్నారు. ప్రజలు తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని కోరుతున్నారు.