Marriage Celebration: ‘పెళ్లంటే పందిళ్లు, సందళ్లు, తప్పెట్లు తాళాలు, తలంబ్రాలూ, మూడేముళ్లు, ఏడే అడుగులు’ అంటూ సాగిపోతుంది. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో మూడు నెలల తరువాత శుభముహూర్తాలు రావడంతో పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్నారు. చాలా రోజుల గ్యాప్ తరువాత మంచి ముహూర్తాలు రావడంతో ఇప్పటికే సంబంధాలు కుదుర్చుకున్న వేల జంటలు పెళ్లిపీటలు ఎక్కనున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు ముహూర్తాలు ఉన్నాయి. దీంతో పెళ్లికి అనుబంధంగా ఉండే వ్యాపారాలు పుంజు కోనున్నాయి.
పురోహితులకు డిమాండ్
మంచి ముహూర్తాలు తక్కువే ఉండడంతో ఒక్కో రోజున వేల పెళ్లిళ్లు జరగనున్నాయి. దీంతో పురోహితులకు డిమాండ్ ఉండనుంది. పెళ్లివారు ఇప్పటికే పురోహితులను బుక్ చేసుకున్నారు. స్థానికంగా ఉన్న పురోహితులను అల్రెడీ బుక్ చేసుకోవడంతో సమీప పట్టణాలు, నగరాల నుంచి పిలిపించుకుంటున్నారు. కొందరు పురోహితులు ఒకే రోజున రెండు పెళ్లిళ్లు సైతం చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఉదయం ముహూర్తానికి ఒక పెళ్లి, మధ్యాహ్నం లేదా సాయంత్రం మహూర్తానికి మరో పెళ్లి నిర్వహించేలా అడ్వాన్సులు తీసుకుంటున్నారు. చాలా రోజుల తరువాత శుభముహూర్తాల రావడంతో ఇదే అదును పంతుళ్లు రేట్లు సైతం పెంచేసినట్లు తెలిసింది. పెళ్లి వేడుకకు పురోహితుడు తప్పనిసరి కావడంతో వారు అడిగినంత ముట్టజెప్పి బుక్ చేసుకుంటున్నారు.
వీడియో గ్రాఫర్ల హడావుడి
పెళ్లి అంటే ప్రస్తుతం ఆడంబరంతో కూడుకున్న తంతుగా మారింది. దీంతో వివాహ వేడుకకు ఫొటో, వీడియో గ్రాఫర్లను బుక్ చేసుకుంటున్నారు. పెళ్లిలో ఏది ఉన్నా లేక పోయినా వీరు తప్పనిసరిగా మారింది. కొందరు ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించుకుంటున్నారు. పెళ్లి ముందే వధువూ, వరుడూ కలిసి అందమైన లొకేషన్లలో షూటింగ్ తీయించుకొని ఆ జ్ఞాపకాలను పదిలపర్చుకుంటున్నారు. మరికొందరు పెళ్లికి ఇద్దరు, ముగ్గురు ఫొటో, వీడియో గ్రాఫర్లను బుక్ చేసుకుంటున్నారు. కలకాలం గుర్తిండిపోయేలా పెళ్లి వేడుకను రిచ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. పెళ్లికి వచ్చే అతిథుల దగ్గర నుంచి వధూ వరుల ప్రతి మూవ్‌మెంట్‌ను కెమెరాలో బంధిస్తున్నారు. ఇందు కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడడంలేదు.
పెరిగిన బంగారం కొనుగోళ్లు
పెళ్లి వేడుకలో బంగారం పాత్ర చాలా ముఖ్యమనదే. పెళ్లి ఎంత సింపుల్‌గా చేసిన కనీసం వధువుకు మెట్టెలు, పుస్తెలు వంటి ఆభరణాలు చేయిండం తప్పనిసరి. పెళ్లి ముహూర్తాలు షురూ కావడంతో బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. జీవితంలో గుర్తుండిపోయేలా పెళ్లి వేడుకను నిర్వహించాలనుకునే కొందరు బంగారం కొనుగోలుకు వెనుకాడడంలేదు. బంగారు గాజులు, ఉంగరాలు, బ్రాస్‌లెట్, చైన్లు, నెక్లెస్ వంటి ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు. వధువు పుత్తడి బొమ్మలా కనిపించేలా బంగారు ఆభరణాలతో అలంకరిస్తున్నారు.
పెళ్లిమండపాలు ఫుల్
దాదాపు మూడు నెలల తరువాత పెళ్లి మండపాలు కళకళలాడుతున్నాయి. ముందుగానే పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్నవారు అడ్వాన్స్ ఇచ్చి మండపాలు బుక్ చేసుకున్నారు. స్థానికంగా మండపాలు ఖాళీ లేకపోవడంతో పక్క ఊళ్లలో మండపాలను వెతుకుతున్నారు. అక్కడా ఖాళీ లేకపోవడంతో స్థానికంగా ఉండే ఆలయాలు, ఇంటి సమీపలోని ఖాళీ స్థలాల్లోనే పెళ్లి వేడక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎంత చిన్న ఫంక్షన్ హాల్ అయినా కనీసం రూ.50 వేలు తీసుకుంటున్నారు. అన్ని సౌకర్యాలు ఉన్న ఫంక్షన్ హాళ్లు రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు తీసుకుంటున్నారు. పెళ్లి వేడుకను ఆడంబరంగా నిర్వహించాలనుకునేవారు ఖర్చుకు వెనుకాడడంలేదు.
కళకళలాడుతున్న బట్టల షాపులు
శ్రావణ మాసం ప్రారంభం కావడంతో వస్త్రదుకాణాలు కళకళలాడుతున్నాయి. సమీప పట్టణాలకు వెళ్లి షాపింగ్ చేస్తుండగా, మరికొందరు నిజామాబాద్, హైదరాబాద్‌కు కుటుంబ సమేతంగా వెళ్లి షాపింగ్ చేస్తున్నారు. వధూవరులతోపాటు కట్న కానుకలు సమర్పించే అవసరమైన బట్టలు కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. వధువు లేటెస్ట్ డిజైన్ సారీస్ సెలక్ట్ చేసుకుంటున్నారు. ఒక్కో సారీకి రూ. లక్ష వరకు ఖర్చు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. సారీకి మ్యాచింగ్ జాకెట్ కోసం రూ.10 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. రకరకాల డిజైన్లతో కుట్టించుకుంటున్నారు.
బ్యూటీ పార్లర్లతో అందం రెట్టింపు
పెళ్లి సందడి మొదలవడంతో బ్యూటీ పార్లర్లకు గిరాకీ పెరిగింది. వధువుకు నాలుగైదు షెన్స్‌లో బ్యూటిఫుల్‌గా రెడీ చేస్తున్నారు. పెళ్లికి పది రోజుల ముందు నుంచే బ్యూటీ టిప్స్ ఫాలో అవుతున్నారు. రోజుకో విధానంలో ఫేషియల్ చేస్తూ వధువు మరింత అందంగా కనిపించేలా చేస్తున్నారు. అమ్మాయిలతోపాటు అబ్బాయిలు పార్లర్లను ఆశ్రయిస్తున్నారు.
డీజే సందడి
పెళ్లంటే ఎంతో హడావుడితో కూడుకున్న కార్యక్రమం. సింపుల్‌గా జరిగిపోతే ఏం బాగుంటుంది. డీజే సౌండ్ సిస్టమ్ ఉంటే పెళ్లి వేడుకలో ఉత్సాహం నింపుతుంది. మెలోడీ, ప్రైవేటు, డీజే తదితర పాటలతో వెడ్డింగ్ హాల్ రీసౌండ్ అవ్వాల్సిందే. ట్రెండింగ్ పాటలకు కుర్రకారు స్టెప్పులేస్తుంటే వేడకకు కొత్త అందం అద్దినట్లు అవుతుంది.
మెహందీ ప్రత్యేకం
వధువు ఎంత సిగారించుకున్నా, ఎన్ని ఆభరణాలు ధరించినా మెహందీ లేని చేతులు బోసిపోయినట్లు కనిపిస్తాయి. మెహందీ డిజైనర్లను రప్పించుకొని వధువు మూడ్రోజుల ముందే రెడీ అవుతుంది. అమ్మాయితోపాటు ఇంట్లోని మహిళలు తమ చేతులకు మెహందీ పెట్టించుకొని మురిసిపోతుంటారు. మునివేళ్ల నుంచి ముంజేతి వరకు రకరకాల డిజైన్లతో అమ్మాయి చేతులు కొత్త కళను సంతరించుకుంటాయి.
శుభముహూర్తాలు ఇవే
బుధవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు 16 ముహూర్తాలు ఉన్నాయి. సెప్టెంబర్‌లో మళ్లీ బ్రేక్ పడనుంది. అప్పుడు అన్నప్రాసనాది ముహూర్తాలే ఉండనున్నాయి. ఈ శ్రావణ మాసంలో 16 ముహూర్తాలు ఉన్నాయి. ఈ నెల 7, 8, 9, 10, 11, 13, 14, 15, 17, 18, 19, 22, 23, 24, 26, 28వ తేదీలు పెళ్లి నిర్వహించేందుకు అనుకూలం అని పండితులు తెలిపారు. సెప్టెంబర్‌లో ఎలాంటి ముహూర్తాలు లేవు. ఈ నెల 9న నాగుల పంచమి, 16న వరలక్ష్మి వ్రతం, 19న రాఖీ పౌర్ణమి, 27న కృష్ణాష్టమి తదితర పండగలు ఉన్నాయి.
బ్యాండ్ తీన్మార్
డీజేలు పెట్టుకున్నా బ్యాండ్ మేళా, సన్నాయి వాయిద్యాలు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వీటితోపాటు టెంట్ హౌస్, పెళ్లి పందిళ్లు, క్యాటరింగ్, వంటలు చేసే వారికి, ఈవెంట్ ఆర్గనైజర్లు, కళాకారులకు డిమాండ్ ఉండనుంది.