Cybercrime: జల్సాలకు అలవాడు పడిన రాజస్థాన్‌కు చెందిన యువకులు ముఠాగా ఏర్పడ్డారు. జిల్లాలో పరిచయం ఉన్న వ్యక్తితో కలిసి సైబర్ నేరాలకు పాల్పడ్డారు. ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిర్మల్ జిల్లాలోని కుంటాల మండలంలోని అంబకంటి గ్రామంలోని బంధువు అయిన సలీం అనే అతని ఇంట్లో ఇటీవలే మకాం మార్చారు. సలీంను సైతం వీరి టీంలో చేర్చుకుని మోసం చేస్తూ డబ్బులు సంపాదించడం చాలా సులభం అని చెప్పి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. షేక్ నసీంఖాన్, తస్లీమ్ ఖాన్, సలీంఖాన్ గత నెల 24వ తేదీన సాయంత్రం సుమారు 7.30 గంటల ప్రాంతంలో కుంటాల బస్టాండ్ సమీపంలోని అభిలాష ఏటీఎమ్ సర్వీస్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. ముగ్గరురిలో ఒకరు లోపలికి వెళ్లి తనకు రూ.50,000 నగదు అవసరం ఉందని, తాను ఆ అమౌంట్‌ను ఆన్లైన్ ద్వారా పంపిస్తానని ఏటీఎమ్ సర్వీస్ సెంటర్ నిర్వాహకుడిని కోరాడు. తన దగ్గర అప్పటికప్పుడు అంత డబ్బులు లేవని చెప్పి వెయిట్ చేయమని చెప్పాడు.
కొద్ది సేపటికే అదే ఏటీఎమ్ సర్వీస్ సెంటర్‌కు జుట్టు గంగాధర్ అనే స్థానిక బట్టల వ్యాపారి అక్కడికి వచ్చాడు. తను వ్యాపారానికి సంబంధించిన డబ్బులను తన అకౌంట్లో వేసేందుకు షాప్ యజమానిని కోరాడు. ఇదే అదునుగా భావించిన యువకుడు ఆయనతో మాట్లాడారు. తాను అంబకంటి వాసిని అని పరిచయం చేసుకున్నాడు. తన అకౌంట్‌కి రూ.50,000 ఎవరి ద్వారానో పంపినట్లుగా పంపించి వ్యాపారి వద్ద నుంచి రూ.50,000 నగదును తీసుకుని అక్కడ నుండి జారుకున్నాడు. గత నెల 27వ తేదీన బాధితుడు బ్యాంక్‌కు వెళ్లి రూ.50,000లను విత్ డ్రా చేయాలని చూడగా అకౌంట్ ఫ్రీజ్ అయినట్లుగా బ్యాంకు వారు తెలిపారు.
తిరిగి బ్యాంక్ అధికారులకు వాకబు చేయగా మోసపోయినట్లు గుర్తించి కుంటాల పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై వెంటనే స్పందించిన కుంటాల పొలీసులు విచారణ చేపట్టారు. ఈ నెల 6వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 8 సెల్ ఫోన్లు, 10కి పైగా ఏటీఎమ్ కార్డులను, వారి గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చీటింగ్ కేసు నమోదు చేసి వారిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న అవినాష్ కుమార్ ఐపీఎస్, భైంసా రూరల్ ఇన్స్పెక్టర్ నైలు, కుంటాల ఎస్ఐ రజినీకాంత్, కుంటాల పోలీసు స్టేషన్ సిబ్బందిని ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల అభినందించారు.