సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్
Government hospital medical staff protest: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి ముందు వైద్య ఉద్యోగులు శుక్రవారం మౌన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల సంఘం ఉప ప్రధాన కార్యదర్శి కుమారం శ్రీనివాసచారి మాట్లాడుతూ, వైద్య విధాన పరిషత్ ద్వారా ఎంపికైన వైద్య ఉద్యోగులు, డాక్టర్స్ నర్సులు ఇతర సిబ్బందికి సకాలంలో వేతనాలు రాకపోవటం వలన ఇబ్బంది పడుతున్నారని, తెలంగాణ రాష్ట్ర వైద్య ఉద్యోగుల సంఘం పిలుపుమేరకు మౌన దీక్ష నిర్వహించడం జరిగిందని అన్నారు. గత అనేక సంవత్సరాలుగా వేతనాలు సరైన సమయంలో రావడం లేదని, ఒకటవ తేదీన కాకుండా ప్రతినెల ఒకటి రెండు వారాలు మించి రావడం తమకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన చెందారు. అహర్నిశలు వైద్య వృత్తిలో సమయం సందర్భం లేకుండా కృషి చేస్తున్న తమ వేతనాలు మాత్రం సక్రమంగా చెల్లించక పోవడం బాధాకరం అన్నారు. ఇప్పటి నుంచి అయినా ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేసారు. కార్యక్రమంలో డాక్టర్లు వంశీ మాధవ్, సాయి కృష్ణ, సుధీర్, శైలజ, మమత, ఉపేంద్ర, కల్కి దివ్య, నర్సింగ్ గ్రేడ్ వన్ శ్రీమతి నెరి మనీ, స్వరూప, శబ్నం సిస్టర్స్ మమత, సుజాత, కిరణ్మయి, భాగ్యలక్ష్మి, కావేరి వెంకటమ్మ, షఫీనా తదితరులు పాల్గొన్నారు.
