Whip Adluri Laxman Kumar: ధర్మపురి, నవంబర్ 19 (మన బలగం): సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలిరావాలని విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన నేపథ్యంలో మేడిపెల్లి, కథలాపూర్ మండలాల్లో పర్యటిస్తారని తెలిపారు. మంగళవారం కథలపూర్ మండల కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి ముందు దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మేడిపెల్లి పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గల్ఫ్‌లో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించడం, చేనేత కార్మికుల కోసం యారన్ డిపో, జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సవం, రూ.126 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం, మిడ్ మానేర్ భూనిర్వాసితుల కోసం 4,696 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.237 కోట్ల నిధులను మంజూరు చేశారని తెలిపారు.
బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు జగిత్యాల జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ బ్లాక్, మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల, విభాగాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేములవాడ సిరిసిల్ల ప్రాంత ప్రజల సమస్యలను, కష్టాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని, గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేశారని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలు మెచ్చిన ప్రజా పాలనను కాంగ్రెస్ సర్కారు కొనసాగిస్తోందని తెలిపారు. వేములవాడలో రాజన్న సాక్షిగా నిర్వహించబోయే బహిరంగ సభకు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరయ్యే విధంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.