Bandi Sanjay tour of Nagaland
Bandi Sanjay tour of Nagaland

Bandi Sanjay tour of Nagaland: ఈశాన్య రాష్ట్రాల సమగ్రాభివృద్ధే లక్ష్యం

  • కేంద్ర మంత్రి బండి సంజయ్
  • నాగాలాండ్‌లో ‘సంపూర్ణతా అభియాన్’పై సమీక్ష
  • ఆయిల్ పాం సాగును ప్రోత్సహించాలని కోరిన కేంద్ర మంత్రి
  • మారూమూల ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో భేటీ
  • కాక్ చుంగ్ జిల్లా ఆస్పత్రిని సందర్శన
  • కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన నాగాలాండ్ డీజీపీ
  • బండి సంజయ్‌కి నాగాలాండ్ గవర్నర్ ప్రత్యేక విందు

Bandi Sanjay tour of Nagaland: మనబలగం, తెలంగాణ బ్యూరో: నాగాలాండ్ సహా వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాలను సమగ్రాభివృద్ది చేసేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా.. నాగాలాండ్‌లో పర్యటిస్తున్న బండి సంజయ్ మంగళవారం మొకాక్ చుంగ్ జిల్లాలో పర్యటించారు. ఉదయం నాగాలాండ్ రాజధాని కొహిమా నుంచి హెలికాప్టర్‌లో మొకాక్ చుంగ్‌కు చేరుకున్న బండి సంజయ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ సువిసీ ఫోజీ ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సంపూర్ణతా అభియాన్‌లో భాగంగా నీతి అయోగ్ ఎంపిక చేసిన ఆకాంక్షిత జిల్లాల జాబితాలో మోకాక్ చుంగ్ ఒకటి. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మాట్లాడుతూ జిల్లాలో కేంద్ర పథకాలు, కార్యక్రమాల అమలులో భాగంగా క్షేత్రస్తాయిలో ఎదురవువుతున్న ఇబ్బందులు, ప్రజల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం కేంద్రం నుంచి అందించాల్సిన సహకారంపైనా సూచనలు తీసుకున్నారు. జిల్లాలోని విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుచ్ఛక్తి, సంక్షేమం, రవాణా, జల్ శక్తి రంగాలపై ప్రత్యేకంగా సమీక్షించారు.

స్కిల్ డెవలెప్‌మెంట్, సంక్షేమ పథకాల అమలుపైనా అధికారుల నుంచి పలు వివరాలు సేకరించారు. మారుమూల ప్రాంతాల్లో స్టాఫ్ కొరత తీవ్రంగా ఉందని ఈ సందర్భంగా అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. చాలా గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదని, దీంతో గర్భిణులు, విద్యార్థులు తీవ్ర అవస్థ పడుతున్న విషయంపై ఆరా తీశారు. జిల్లా కేంద్రంలో నీటి కొరత వేధిస్తోందన్నారు. అట్లాగే స్కిల్ డెవలెప్‌మెంట్ ప్రోగ్రాంలో భాగంగా నాగాలాండ్ విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రానికి ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించగా నోట్ చేసుకున్నారు. అసోం రాష్ట్రంతో సరిహద్దు సమస్యపై నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయని, వాటిని పరిష్కరించాలని అధికారులు సూచించగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈసారి ‘ఆయిల్ పాం’ పంటలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్న జిల్లాలో రైతులను ఆయిల్ పాం పంటల సాగు చేసేలా ప్రోత్సహించాలని కోరారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి బడ్జెట్‌లో 11 వేల కోట్లకుపైగా నిధులు కేటాయించినట్లు తెలిపారు.

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందన్నారు. ఏటా రూ.2.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. నిధుల వినియోగం, కార్యక్రమాల అమలు తీరుపై 15 రోజులకు ఒకసారి ఆయా రాష్ట్రాల్లో సమీక్షిస్తోందన్నారు. అందులో భాగంగానే తాను వచ్చానన్నారు. కేంద్ర మంత్రిత్వశాఖలు ఖర్చు చేసే మొత్తం బడ్జెట్‌లో 10 శాతం మేరకు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికే కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా నాగాలాండ్ సహా ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నదే మోడీ అభిమతమన్నారు. మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం, వ్యవసాయం, రవాణా సేవలన్నీ అందించాల్సిన అవసరం ఉందన్నారు. అట్లాగే కనీస మౌలిక సదుపాయాలన్నీ అందుబాటులోకి తేవడంతోపాటు మారుమూల అటవీ, కొండ ప్రాంతాల్లో నివసించే ప్రతి కుటుంబానికి జల్ జీవన్ మిషన్ కింద తాగు నీటిని అందించేలా కృషి చేస్తామని తెలిపారు. అంతిమంగా ఈశాన్య రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో నివసించే ప్రజలందరికీ సంతృప్తికర స్థాయిలో (శాచ్యరేషన్) ప్రభుత్వ ఫలాలను అందించాలన్నదే మోడీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకోసం తగిన సహాయ సహకారాలు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

అనంతరం అధికారులతో కలిసి మొకాక్ చుంగ్ జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం రూ.5 కోట్ల నిధులతో నిర్మిస్తున్న నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో జాప్యం జరుగుతున్న విషయాన్ని గుర్తించారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసి నూతన భవన నిర్మాణంలో ఆస్పత్రి సేవలు అందుబాటులో వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం అధికారులతో కలిసి హెలికాప్టర్‌లో కొహిమాకు తిరిగొచ్చిన బండి సంజయ్ కుమార్‌ను నాగాలాండ్ రాష్ట్ర డీజీపీ రూపిన్ శర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై కొద్దిసేపు చర్చించారు. మరోవైపు నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ ఇచ్చిన డిన్నర్‌లో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌తో కొద్దిసేపు ముచ్చటించారు. నాగాలాండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ డిన్నర్‌కు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *