Awareness on cultivation of traditional: నిర్మల్, డిసెంబర్ 21 (మన బలగం): ఆధునిక పద్ధతులలో సంప్రదాయ పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ ఆహార భద్రత పథకం-2024, కింద జిల్లాలో వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న కార్యాచరణపై వ్యవసాయ శాఖ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆధునిక పద్ధతుల ద్వారా సాంప్రదాయ పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధించేలా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో వరి, జొన్న, నూనె గింజలు, పప్పు ధాన్యముల విస్తీర్ణం పెంచాలని, అలాగే అధిక దిగుబడులు సాధించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకుగాను కార్యాచరణ అమలుకు కోటి రూపాయల నివేదిక ఆమోదించామని తెలిపారు. కృత్రిమ ఎరువులు అధికంగా వాడటం వల్ల భూసారం దెబ్బ తినడంతో పాటు, వాటి ద్వారా పండిన పంటలు అనేక రకాల వ్యాధులకు కారణమవుతాయని తెలిపారు. ఇప్పటికే ప్రజలంతా సేంద్రీయ ఉత్పత్తుల వైపు మల్లుతున్నారని తెలిపారు. సహజ సిద్ధ ఎరువులతో పండించిన పంటలకు విపణిలో మంచి గిరాకీ ఉందన్నారు. రైతులందరికీ సేంద్రియ వ్యవసాయ ప్రాధాన్యంపై అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించి, సహజ సిద్ధ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు.
వేప నూనెను పంటల ఎరువుగా విరివిగా ఉపయోగించడం వల్ల అధిక దిగుబడులు సాధించి, లాభాలు పొందవచ్చునన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా స్వయం సంఘాల వారిచే ఈ వేప నూనె తయారీ ప్రారంభించి ఇరువర్గాలు లాభం పొందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటిస్తున్న రైతులను గుర్తించి, సంఘాలను ఏర్పాటు చేసి లబ్ధి పొందే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయంపై ఆసక్తి ఉన్న మరింత మంది రైతులను గుర్తించి, ‘రైతుల ద్వారా రైతులకు అవగాహన’ అనే విధానం ద్వారా సేంద్రియ పంటలను సాగుపై అవగాహన కల్పించాలన్నారు. సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలకు ఆసక్తి ఉన్న రైతులను తీసుకెళ్లి మెలకువలను నేర్పాలని, సేంద్రియ పద్ధతుల్లో చిరుధాన్యాలు, నూనె గింజల సాగును ప్రోత్సహించాలాన్నారు. మహిళా శక్తి క్యాంటీన్లలో సేంద్రియ ఉత్పత్తుల ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు. అనంతరం కడెం వ్యవసాయ శాఖ విత్తన ఉత్పత్తి కేంద్రానికి మంజూరైనా పట్టా పాస్ బుక్ ను అధికారులకు జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, డి ఆర్ డి ఓ విజయలక్ష్మి, మార్క్ఫెడ్ డిఎం ప్రవీణ్, అధికారులు, సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.