Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay: మూసీ పునరుజ్జీవం అతి పెద్ద స్కామ్

  • లండన్, సీయోల్ కాదు.. మూసీ బాధితుల వద్దకు వెళ్లే దమ్ముందా?
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ నిర్లక్ష్యంతోనే మూసీకి ఈ దుస్థితికి
  • సబర్మతి, నమామి గంగతో మూసీకి పోలికా?
  • మీ అల్లుడి కోసం మూసీ దోపిడీకి ప్లాన్ చేస్తారా?
  • కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తాం
  • మూసీ బాధితులకు మేం అండగా ఉంటాం
  • ఇందిరా పార్క్ ధర్నాలో కేంద్ర మంత్రి బండి సంజయ్

Bandi Sanjay: మనబలగం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కోసమే మూసీ ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ స్కాంకు తెర తీసిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో బండి సంజయ్ మాట్లాడారు. ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మేమంతా మీకు అండగా ఉంటాం. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టి 287 కిలోమీటర్లు ప్రవహిస్తున్న మూసీ డ్రైనేజీ నీటితో నిండిపోయింది. దాదాపు 12 వేల పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాలతో విషంగా మారింది. పాదయాత్రలో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో మూసీ దుస్థితిని చూశా. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్సే ఈ దుస్థితికి కారణం. 1997లో ప్రక్షాళన పేరుతో కర్మన్ ఘాట్‌లో ‘నందనవనం’ 2005లో ‘సేవ్ మూసీ క్యాంపెయిన్’ పేరుతో హంగామా, నేష‌న‌ల్ రివ‌ర్ క‌న్జర్వేషన్ ప్లాన్‌, జైకా, జపాన్ నిధుల ఖర్చు, 2014 వరకు సమైక్య పాలనలో కొనసాగిన దోపిడీ ఇందుకు నిదర్శనం. కేసీఆర్ పాలనలో 16,634 కోట్లతో ‘మూసీ సుందరీకరణ’ డ్రామా నడిచింది.

హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్లు, ‘మూసీ రివర్‌ఫ్రంట్‌’ ఏర్పాటు, 8,500 పైచిలుకు అక్రమ కట్టాడాల గుర్తింపు, 15 వేల మంది నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని హామీలు. అడుగు ముందుకు పడలేదు. మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటుతో రాజకీయ పునరావాసం. తెలంగాణ సొమ్ము కర్నాటక, మహారాష్ట్ర, పంజాబ్ పాలయింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన పేర లక్షనర్నర కోట్లు ఖర్చు చేసి లండన్‌లోని థేన్స్ మాదిరిగా మారుస్తామని అంటుంటే మంత్రులేమో దక్షిణ కొరియా సియోల్‌లోని ‘చంగ్ ఏ చంగ్’ నదిలా తీర్చిదిద్దుతామని అంటున్నరు. మూసీని అడ్డుపెట్టుకుని కబ్జా చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం నేతల బిల్డింగుల జోలికి పోయే దమ్ముందా? పేదల ఇండ్ల జోలికొస్తే ఖబడ్డార్. వాళ్ల ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డమేస్తం. బుల్డోజర్లు రావాలంటే మమ్ముల్ని దాటిపోవాలే. మూసీ ప్రక్షాళనకు సబర్మతి నదితో పోలికా? నమామి గంగే ప్రాజెక్టుతో పోలికా? సబర్మతికి 7 వేల కోట్ల ఖర్చు అయింది. వందల కిలోమీటర్ల పొడవున్న నమామి గంగేకు రూ.40 వేల కోట్లు మాత్రమే ఖర్చు అయింది. మూసీ ప్రాజెక్టు లక్షన్నర కోట్లు ఎందుకు? కిలోమీటర్‌కు 2 వేల కోట్ల ఖర్చు ఎందుకు? అల్లుడి కోసమే మూసీ డ్రామాలాడుతున్నారు. కాంగ్రెస్ దోపిడీని అడ్డుకుని తీరుతాం.’ అని బండి ఫైర్ అయ్యారు.

Bandi Sanjay
Bandi Sanjay

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *