KTR effigy burning
KTR effigy burning

KTR effigy burning: కేటీఆర్ దిష్టిబొమ్మన దహనం

KTR effigy burning: నిర్మల్, అక్టోబర్ 25 (మన బలగం): రైతులను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జి ఆత్రం సుగుణక్క మండిపడ్డారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ నిర్వహించిన సభలో కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ మాట్లాడిన మాటలను ఖండిస్తూ శుక్రవారం గుడిహత్నూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదుట కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేటీఆర్ డౌన్ డౌన్, బీఆర్ఎస్ డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతు వ్యతిరేక విధానాలను అవలంబించిన నాయకులు ఇప్పుడు రైతులపై ప్రేమ ఒలకబోస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోపే ఇచ్చిన హామీలను అమలు చేయడాన్ని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ లేనిపోని ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.

ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గడువులోగా రుణమాఫీ చేసి పాలనలో తమ మార్క్ ఎలా ఉంటుందో కాంగ్రెస్ ప్రభుత్వం చూపించిందని అన్నారు. రుణమాఫీ ఎట్ల చేస్తరు? అసలు సాధ్యం కానే కాదు? అన్నోళ్ల నోర్లు మూయించామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపించామని చెప్పారు. ఇప్పుడు విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు పదేండ్లలో పది వాయిదాల్లో కూడా రుణమాఫీ పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ గతంలో సన్న వడ్లు పండించాలని, రూ.100 బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేశాడని అన్నారు. రైతులను ప్రోత్సహించడానికి, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సన్న వడ్ల సాగు పెంచేందుకు రూ.500 బోనస్ ఇస్తామంటే కేసీఆర్ కుటుంబానికి ఎక్కడలేని బాధ కలుగుతోందని ఎద్దేవా చేశారు. రైతులను గోస పెట్టి, ప్రజాధనాన్ని కొల్లగొట్టి రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశాడని, ఇప్పుడు మళ్లీ ప్రజలను మభ్య పెట్టేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సంక్రాంతి గంగిరెద్దుల్లా పోటీ పడుతున్నారని విమర్శించారు.

మీ ఆగడాలు, మీ అబద్దాలకోరు మాటలు భరించలేక రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చీ కొట్టి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని గద్దనెక్కించారని తెలిపారు. అయినా మీ బుద్ధి మారటం లేదన్నారు. డబుల్ బెడ్ రూమ్, దళిత బంధు, మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, నీళ్లు నిధులు, నియామకాలు అని పదేళ్లు పాలించి ప్రజలను మోసం చేశారని అన్నారు. రైతుల కోసం కేటీఆర్ జైలుకెళ్లటానికి సిద్ధమని చెప్పటాన్ని ఖండించారు. గతంలో మీరిచ్చిన వాగ్దానాల ప్రకారం రైతులకు రుణమాఫీ చేయనందుకు, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వనందుకు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3,000 మంది ఆత్మహత్య చేసుకుంటే ఏ ఒక్కరిని ఆదుకోనందుకు మీరు జైలుకు వెళ్తానని ఒప్పుకున్నట్లుగా ఉందని విమర్శించారు. 2004లో ఉచిత విద్యుత్ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ అని, 2024లో 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేదే కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తోనే ప్రజాసంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.

ప్రజలు ఎవరు కూడా బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్యాల కరుణాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ షాహిద్, మాజీ ఎంపీటీసీ అంకతి రవి, జయరాం మండల ఉపాధ్యక్షులు ఆరిఫ్ ఖాన్ ప్రధాన కార్యదర్శి శ్యామ్ రావు గణేశ్ గౌడ్ మండల ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షులు దుబాక నరేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాజీద్, యూత్ అధ్యక్షులు విష్ణు, మండల మహిళా అధ్యక్షురాలు అనసూయ, కార్యదర్శి లలిత గంగామణి, యూత్ కాంగ్రెస్ మహేందర్ మండల సీనియర్ నాయకులు రవి ముండే, ససనే మాధవ్, శంకర్ గోవింద్, చత్రుగన్ కత్లె రామదాస్, ఆవుల రమేశ్, సురేశ్, పునజీ, విష్ణు, కాకిడే ఎక్నాథ్ పటేల్, తొడసం రవి, నాయకులు రమేశ్ రాథోడ్, కృష్ణ మాలాజీ రాథోడ్ సుభాష్, సిడం శంకర్, నాగోరావు, గణేశ్, జంగు సంజీవ్ ముస్తఫా శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *