- ప్రధానోపాధ్యాయుడు సహా ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్
- ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్
teachers suspension: నిర్మల్, ఫిబ్రవరి4 (మన బలగం): దారి తప్పిన గురువు శీర్షికన ‘మన బలగం’ పత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. వెకిలి వేషాలు వేస్తున్న గురువును సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ ఉపాధ్యాయుడితోపాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మరో ఉపాధ్యాయుడు సహా మొత్తం ముగ్గురు సస్పెన్షన్‌కు గురయ్యారు. కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులు రావడంతో వీరిని సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై శాఖా పరమైన విచారణ కొనసాగుతుందని, ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ ఘటనపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
అసలేం జరిగిందంటే..
బడిలో పిల్లలను తన కన్న పిల్లల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయుడు వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన నిర్మల్ జిల్లా గాజుల నర్సాపూర్ హైస్కూల్లో ఆలస్యంగా వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించడం, వెకిలి చేష్టలు చేయడం, వారి శరీరాలను తాకడం చేస్తూ ఉండేవాడని విద్యార్థినులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. గత సంవత్సరం 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులు ఈ విషయమై ప్రధానోపాధ్యాయుని దృష్టికి తీసుకెళ్లినా ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. నర్సాపూర్ అంజని తాండకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని లెక్కల మాస్టారు వెకిలి చేష్టలను భరిస్తూ వచ్చింది. ఈ ఏడు పదో తరగతిలోనూ పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో తల్లిదండ్రులకు తెలిపింది. కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని సదరు ఉపాధ్యాయుడిని విచారించగా దాటవేసే ప్రయత్నం చేశాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయుడిని తీవ్రంగా మందలించి చేయి చేసుకున్నారు. ఇంత జరుగుతున్నా ప్రధానోపాధ్యాయుడు స్పందించకపోవడం విద్యార్థినులకు శాపంగా మారింది. ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయం బయటకు రావడంతో ఎవరి స్థాయిలో వారు తప్పించుకునే ప్రయత్నం చేశారు. సస్పెన్షన్‌కు గురైన సదరు ఉపాధ్యాయుడు గతంలో పనిచేసిన బెల్తారోడా, బీరెల్లి గ్రామాల్లోనూ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు.