అవసాన దశలో ఉన్న.. అండగా ఉండు కొడుకా
Maoist leader Tumu Srinivas mother: నిర్మల్, ఫిబ్రవరి 6 (మన బలగం): ‘మూడున్నర దశాబ్దాల క్రితం బాయ్.. పోతున్న అంటూ వెళ్లిపోయావు బిడ్డ.. 35 ఏళ్లు గడుస్తున్నా కంటికి కనిపించకుండా పోయావు. చూడాలని ఉంది.. అల్లారుముద్దుగా పెంచుకున్నా.. నువ్వే నా ప్రాణం.. లొంగిపో బిడ్డా’ అంటూ ఓ మావోయిస్టు తల్లి అవసాన దశలో ఉన్నా ఆదుకో బిడ్డా అంటూ అర్థిస్తోంది. వివరాల్లోకి వెళ్తే ఖానాపూర్ మండలం బావాపూర్ గ్రామానికి చెందిన తూము లచ్చవ్వ కుమారుడు తూము శ్రీనివాస్ 35 ఏళ్ల క్రితం 14వ యేట అడవి బాట పట్టాడు. మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా ఎదిగి రాష్ట్రస్థాయి నాయకుల్లో ఒకరుగా శ్రీనివాస్ పని చేస్తున్నారు. తిరిగి ఊరు వైపు కన్నెత్తి చూడని శ్రీనివాస్ లొంగిపోవాలని తల్లి వేడుకుంటోంది. వయసు పైబడింది. చేతకావడం లేదు. చివరికి తలకొరివి పెట్టేందుకైనా తిరిగిరా బిడ్డా అంటూ వేడుకుంటోంది. ఊపిరి ఉండగానే తిరిగి వస్తే కళ్లారా చూసుకుని కాలం చేస్తానని తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. పసిప్రాయంలోనే తన కొడుకు అడవి బాట పట్టిన నాటి నుంచి నేటి వరకు కంటి నిండా నిద్ర, కడుపునిండా తిండి తినడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
లొంగిపో ఆదుకుంటాం: జిల్లా ఎస్పీ జానకి షర్మిల
‘కన్న ఊరికి తిరిగి రండి. మీకు అండగా మేముంటాం. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటాం’ అని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. ఖానాపూర్ మండలం బావాపూర్ గ్రామానికి చెందిన మావోయిస్టు నేత తూము శ్రీనివాస్ తల్లి లచవ్వను పరామర్శించి నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అడవి బాట పట్టి విలువైన జీవితాలను పాడు చేసుకుంటున్నారని అన్నారు. ప్రస్తుతం మీ ఉద్యమం మునిగిపోతున్న ఓడలంటిది. అందులో ప్రయాణించి మీ అమూల్యమైన ప్రాణాలు పోగొట్టుకోకండి. నిర్మల్ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపొండి. మీ కుటుంబంతో ప్రశాంతంగా జీవించండి. అంటూ పిలుపునిచ్చారు. ఒక తల్లిగా మరో తల్లి ఆవేదనను అర్థం చేసుకోగలనని ఎస్పీ అన్నారు. శ్రీనివాస్ తన కుటుంబ సభ్యుల కోసం మావోయిస్టు పార్టీని విడి జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంతంగా జీవనాన్ని గడపాలని విజ్ఞప్తి చేశారు. శ్రీనివాస్ పునరావాసానికి సంబంధించి అన్ని రకాల ప్రతిఫలాలను అందజేసి పునరావాసం కల్పించే విధంగా ప్రభుత్వం చేపడుతుందని అని ఎస్పీ తెలియజేశారు. కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఎస్పీతో పాటు ఏ.ఎస్పీ రాజేశ్ మీనా, ఖానాపూర్ సీఐ సైదారావు, ఎస్సైలు ఇతర పోలీస్ సిబ్బందితో పాటు గ్రామ పెద్దలు, శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో పాలు పంచుకున్నారు.
