- ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
- నష్టం అంచనాలు సిద్ధం చేయండి
- నిర్మల్ జిల్లాలో ప్రత్యేక అధికారి హరికిరణ్ పర్యటన
Heavy Rains Alert and Flood Precautions in Nirmal District: నిర్మల్, ఆగస్టు 17 (మన బలగం): మరో మూడు రోజులు వర్షాలు భారీగా కురిసే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికంగా వర్షాలు కురుస్తున్నందున అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని, ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, వాగుల వైపు వెళ్లకూడదని జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి ఆదివారం కడెం ప్రాజెక్టు, పాండాపూర్–రాంపూర్ వంతెనలు, పంట పొలాలను పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గ్రామస్తులను కలసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ, జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలలో వరద నీరు చేరిందని తెలిపారు.
ఈ నెల 20 వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంటలకు నష్టం వాటిల్లితే రైతులకు తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కడెం, స్వర్ణ, శ్రీరాంసాగర్ తదితర ప్రాజెక్టుల్లో నీరు అధికంగా చేరుతుండడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారని చెప్పారు. చేపలు పట్టేవారు, రైతులు, పశువుల కాపరులు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశముందని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వైద్యశాఖ ప్రత్యేక శిబిరాలు నిర్వహించి అవసరమైన సేవలు అందించాలని ఆదేశించారు. రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, వైద్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ అత్యవసర పరిస్థితుల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారీ వర్షాలతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ, సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రాజెక్టులలోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో సమీప గ్రామాల ప్రజలకు ముందస్తు సమాచారం అందిస్తూ నీటిని దిగువకు వదలడం జరుగుతుందని తెలిపారు. అవసరమైన ప్రతి మండలంలో ఎన్ డి ఆర్ ఎఫ్, బెటలియాన్, పోలీస్, రెస్క్యూ టీములు సిద్ధంగా ఉన్నాయని, 24 గంటలు కంట్రోల్ రూమ్ (9100577132) అందుబాటులో ఉందని తెలిపారు. వాగులు, నది పరివాహక ప్రాంతాల ప్రజలు, రైతులు, మత్స్యకారులు, అప్రమత్తంగా ఉంటూ లోతట్టు ప్రాంతాలకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళవద్దని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిశీలనలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, జిల్లా అధికారులు గోవింద్, శ్రీనివాస్, అంజి ప్రసాద్, రమణ, డాక్టర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.