Collector Abhilash Abhinav
Collector Abhilash Abhinav

Nirmal Collector: ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పటిష్ట చర్యలు : నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్

Nirmal Collector: నిర్మల్, జనవరి 9 (మన బలగం): ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇసుక అక్రమ రవాణ నియంత్రణ, ధరణి దరఖాస్తుల పరిష్కారం, తదితర రెవెన్యూ అంశాలపై సంబంధిత అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా అక్రమ రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. మండలాల వారీగా నది, వాగులు వంటి ఇసుక అందుబాటులో ఉన్న ప్రాంతాలను గుర్తించాలని, రహదారులు, భవనాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు వంటి వాటికి ప్రభుత్వ రికార్డులను పరిశీలించి ఇసుక అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణాలు, వాణిజ్య తదితర వాటికి రుసుము చెల్లించిన వారికే ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణ జరుగకుండా గుర్తించిన ప్రాంతాలలో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు ప్రధాన రహదారులపై తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు.

మండల స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో, తహసీల్దార్‌లు సమన్వయంతో అక్రమంగా ఇసుక రవాణా చేసే వాహనాలను గుర్తించి సీజ్ చేయాలనీ, భారీ జరిమానాలు విధించడంతో పాటు సంబంధిత వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలనీ ఆదేశించారు. రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖల అధికారులు ఇసుక అక్రమ రవాణాను నియంత్రించాలని సూచించారు. అలాగే ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో మొత్తమ్ 1665 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. తహసీల్దార్, ఆర్డీవో స్థాయిలలో ఉన్న దరఖాస్తులను మండలాల వారీగా చర్చించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ, దేవాదాయ, అటవీ, వక్స్ తదితర భూములను సర్వే నెంబర్ల వారీగా రికార్డులను సిద్ధం చేయాలనీ ఆదేశించారు. కోర్టు కేసులకు సంబందించిన రిపోర్టులను అందజేయాలన్నారు. అలాగే మండలాల వారిగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ప్రజావాణి, సీఎం ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవోలు రత్నాకళ్యాణి, కోమల్ రెడ్డి, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ సుదర్శన్, ఈడీఎం నదీమ్, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

Collector Abhilash Abhinav
Collector Abhilash Abhinav

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *