Permanent Solution for Flood Issues in GNR Colony: నిర్మల్, ఆగస్టు 17 (మన బలగం): నిర్మల్ పట్టణంలోని జి ఎన్ ఆర్ కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చేపడుతమని జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్ అన్నారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్ ఆదివారం పట్టణంలోని జి ఎన్ ఆర్ కాలనీలో ప్రత్యక్షంగా పర్యటించి పరిశీలించారు. కాలనీలో వరద నీరు ప్రవహించడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మూడు సంవత్సరాలుగా భారీ వర్షాలతో కాలనీలో చేరిన వరద నీరు, తలెత్తిన ఇబ్బందులను కాలనీవాసులు అధికారులకు వివరించారు. కాలనీలో వరద నీరు ప్రవహించినప్పుడు నీటిపారుదల, మున్సిపల్ శాఖల అధికారులు చేపడుతున్న సహాయక చర్యలపై ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా వివరించారు.
తక్షణ చర్యలకు సిద్ధం : ప్రత్యేక అధికారి హరికిరణ్
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపడుతున్నామని ప్రత్యేక అధికారి హరికిరణ్ స్పష్టం చేశారు. కాలనిలో వరదనీటి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ అభిలాష అభినవ్
కాలనీలో వరద నీరు ప్రవహించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతోందని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ టీములు సిద్ధంగా ఉన్నాయని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 9100577132 ను సంప్రదించాలని సూచించారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, రెవెన్యూ, నీటిపారుదల, మున్సిపల్, వైద్య శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.