Vemulawada: మనబలగం, వేములవాడ: ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన బ్లడ్ బ్యాంక్ వేములవాడలో ఏర్పాటు కానున్నది. బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు కొరకు వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో 1000 గజాల స్థలం కేటాయించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వసంత రావు స్థల కేటాయింపు పత్రాలు అందజేశారు. త్వరలోనే రెడ్ క్రాస్ సొసైటీ గౌరవ అధ్యక్షులు, రాష్ట్ర గవర్నర్ చేతులమీదుగా భూమి పూజ నిర్వహించునున్నారు. ఈ బ్యాంక్ ఏర్పాటుతో వేములవాడ ప్రాంతంతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు అత్యవసర సమయంలో రక్తం కావాల్సిన వారికి లభ్యం కానున్నది. బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకు కృషి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు పలువురు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ అందుబాటులో బ్లడ్ బ్యాంక్ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో అందరికీ అందుబాటులో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు, రాజన్న భక్తులకు అత్యవసర సమయాల్లో రక్తం సులువుగా దొరుకుతుందని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
రాజన్న భక్తులతో పాటు ఈ ప్రాంత ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలనే ముఖ్య ఉద్ధేశ్యంతో వేములవాడలో ఈ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి భవన నిర్మాణం కొరకు ఆసుపత్రి ఆవరణలో 1000 గజాల స్థలాన్ని కేటాయించామని, భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంకా అవసరమైన స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ బ్యాంకు ఏర్పాటుతో రక్త పరీక్షలు, ప్లాస్మా, ప్లేట్లెట్స్ తగ్గడం, పెరగడం, తలసేమియాతో బాధపడుతున్న బాధితులకు రక్త సమస్యలకు సంబంధించిన పరిష్కారం దొరుకుతుందని వివరించారు. స్థానికంగా బ్లడ్ బ్యాంకులు అందుబాటులో లేక ఇన్ని రోజులు కరీంనగర్, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లిన ఈ ప్రాంత ప్రజల రక్త కష్టాలు దీంతో తీరనున్నాయని చెప్పారు. జిల్లాకు సంబంధించిన రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ను వేములవాడలో ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన సొసైటీ గౌరవాధ్యక్షులు రాష్ట్ర గవర్నర్, సొసైటీ అధ్యక్ష కార్యదర్శులకు ఈ ప్రాంత ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. త్వరలోనే భవన నిర్మాణం చేపట్టి త్వరగా సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులను కోరారు.