atrocity: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, మార్చి 12 (మన బలగం): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం బంజారా సంఘం నాయకుల ఆధ్వర్యంలో సిరిసిల్ల డీఎస్పీని కలిసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలోని ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండా గ్రామ గిరిజనులపై కొందరు వ్యక్తులు కులం పేరుతో దూషిస్తూ దాడి చేయడానికి ప్రయత్నించారన్నారు. వారిపై స్థానిక ఎస్సై అట్రాసిటీ కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా అమాయకమైన గిరిజనులపై దొంగతనం కేసు నమోదు చేసి జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన జరిగి 20 రోజులైనా సదరు వ్యక్తులపై స్థానిక ఎస్సై అట్రాసిటీ కేసు నమోదు చేయకపోవడంపై ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. విషయాన్ని సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డికి విన్నవించడం జరిగిందని, పూర్తి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. బాధితులకు న్యాయం జరగని పక్షంలో బంజారా సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను సంప్రదిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్ ,జిల్లా విజిలెన్స్ ఎస్సీ, ఎస్టీ మెంబర్ అజ్మీరా తిరుపతి నాయక్, బంజారా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భుక్య భిక్షపతి నాయక్, జిల్లా నాయకులు అజ్మీరా రాజు నాయక్, తాజా మాజీ సర్పంచ్ భుక్య శంకర్ నాయక్, లకావత్ నర్సింహులు నాయక్, గ్రామ మహిళలు పాల్గొన్నారు.