- ఎస్సార్ఎస్పీ, కడెం ప్రాజెక్టులోకి భారీగా ఇన్‌ఫ్లో
- కడెం ప్రాజెక్ట్ 18 గేట్ల ఎత్తివేత
- గడ్డన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టుల గేట్ల ఎత్తివేత
- ఆగని వర్షం
Flood situation in Nirmal district projects: నిర్మల్, ఆగస్టు 16 (మన బలగం): నిర్మల్ జిల్లాలోని కడం స్వర్ణ, గడ్డన్న వాగు ప్రాజెక్టులతో పాటు పొరుగు జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటున్నాయి. అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టుల వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఎగువ నుంచి వస్తున్న నీటి ఉధృతిని అంచనా వేస్తూ గేట్లను ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టులోకి 1,33,252 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది..దీంతో అప్రమత్తమైన అధికారులు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు కడెం ప్రాజెక్టు యొక్క 18 గేట్లను ఎత్తి దిగువన గోదావరిలోకి 2,04,183 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , మత్స్యకారులు గొర్ల, పశు కాపరులు గోదావరి పరివాహక ప్రాంతంలోకి వెళ్ళద్దని హెచ్చరికలు జారీ చేశారు.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద
నిర్మల్ జిల్లా పొరుగుననే ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పెరుగుతుంది. ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1083.30 అడుగుల నీటి మట్టం ఉంది.ప్రాజెక్ట్ లోకి 1,04,879 సకల వరద నీరు వచ్చి చేరుతోంది. కాకతీయ, లక్ష్మి, సరస్వతి కాలువల ద్వారా నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులోకి వస్తున్న వరదనీటి పరిస్థితిని బట్టి అధికారులు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రజలు ఎవరు సంచరించకూడదని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
గడ్డన్న వాగు, స్వర్ణ ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత
నిర్మల్ జిల్లాలోని బైసా గడ్డన్న వాగు, సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టుల గేట్లను శనివారం అధికారులు ఎత్తారు. ప్రాజెక్టుల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఫ్లడ్ గేట్ల ద్వారా నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టుల పరివాహక ప్రాంతంలో ప్రజలు ఎవరు సంచరించకూడదని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ప్రాజెక్టుల వద్ద పటిష్ట బందోబస్తు
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతో సహా నిర్మల్ జిల్లాలోని కడెం, స్వర్ణ, గడ్డన్న వాగు ప్రాజెక్టుల వద్ద పోలీసులు గట్టి బందోబస్తుని ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులన్ని నిండుకుండను తలపిస్తుండడంతో ఏ క్షణాన ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రాజెక్టు పైకి ప్రజలు వెళ్లకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు బందోబస్తున ఏర్పాటు చేశారు.
పరిస్థితిని సమీక్షిస్తున్న జిల్లా అధికారులు
జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుటలు, ప్రాజెక్టులు నిండు నీటితో కలకలలాడుతున్నాయి. ప్రాజెక్టుల వద్ద ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలను అధికారులు చేపట్టారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల,భైంసా సబ్ కలెక్టర్ సాంకేత్ కుమార్ అజ్మీర లు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.