Good news for Surrogates: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పాత చట్టాల్లో మార్పులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కొన్నింటిని సవర చేస్తుండగా, మరికొన్నింటిని పూర్తిగా రద్దు చేస్తింది. మోడీ ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులకు వరంగా మారబోతోంది. సరోగసీ ద్వారా బిడ్డను కనే మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 180 రోజులపాటు ప్రసూతి సెలవులు తీసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇందు కోసం సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నిబంధనల్లో సమూల మార్పులు చేస్తోంది. మరో గుడ్ న్యూస్ ఏంటంటే బిడ్డ తండ్రికి సైతం 15 రోజుల పితృత్వ సెలవులు మంజూరు చేయనున్నారు.
కేవలం తల్లికేకాకుండా సరోగసీ ద్వారా బిడ్డను కనేందుకు గర్భం అద్దెకిచ్చిన మహిళ ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆమెకూ సెలవులు వర్తింపజేయనున్నారు. ఇందు కోసం కచ్చితమైన నిబంధనలు అమలు చేస్తోంది. కేవలం ఇద్దరు పిల్లల వరకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తారు. ఈ మేరకు కేంద్ర మంత్రిత్వశాఖ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా నూతన నియమ నిబంధనలు రూపొందించి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు సరోగసీ ద్వారా బిడ్డ పుడితే మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలనే నిబంధనలు అమలులో లేవు. కొత్త నిబంధనల ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగిని తమ సర్వీసులో పిల్లల ఆలనా పాలన చూసేందుకు గరిష్ఠంగా 730 రోజులు సెలవులు పొందేందుకు అవకాశం కల్పిస్తారు. విద్య, అనారోగ్యం వంటి పరిస్థితుల్లో సెలవులను వినియోగించుకోవచ్చు.