Rajannasirisilla District Collector: ఎల్లారెడ్డిపేట, జనవరి 19 (మన బలగం): ప్రభుత్వ పధకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో కొనసాగుతున్న ప్రభత్వ పథకాలపై సర్వేను ఆదివారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేసారు. రైతు భరోసా కోసం బీడు భూములను, అలాగే పంట పండని భూములను గుర్తించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు, రేషన్ కార్డుల జారీ వంటి సర్వేలో సరైన వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైతు భరోసా పథకం సాగు చేసే ప్రతి రైతుకు అందుతుందని అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పథకాలు చేరుతాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు నిరంతర ప్రక్రియ అని లబ్ధిదారులు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వ్యవసాయం సాగులేని భూములను వెంటనే తొలగించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో సత్తయ్య తదితరులు ఉన్నారు.