- రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఏ పేరు పెట్టుకున్నా నో ప్రాబ్లం
- పద్మ అవార్డుల జాబితా పంపేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి
- ఎంతో మందిని నక్సల్స్‌తో చంపించిన గద్దర్‌కు అవార్డు ఎట్లా ఇస్తాం?
Bandi Sanjay Kumar: మనబలగం, తెలంగాణ బ్యూరో: కేంద్ర సంక్షేమ పథకాల పేర్లను మార్చితే ఊరుకునేది లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోమారు స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్ర సంక్షేమ పథకాల పేర్లు మార్చితే మాత్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన వంటి సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వంతో ప్రమేయం లేకుండా కేంద్రమే నేరుగా ప్రజలకే అందిస్తుందని తెలిపారు. పరిస్థితి అంతవరకు తీసుకురావొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో పేదలకు ఎట్టి పరిస్థితిల్లోనూ అన్యాయం చేయబోమని ఉద్ఘాటించారు. పద్మ అవార్డులకు ప్రతిపాదించే వారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నీ ఆలోచించి పంపాలని సూచించారు. నక్సల్స్ భావజాలమున్న గద్దర్ వందలాది మంది బీజేపీ కార్యకర్తల చావులకు కారణమయ్యారని, అట్లాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను మరోసారి రగిలించి లబ్ది పొందాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ చూస్తున్నాయని, కానీ ప్రజలందరికీ ఈ విషయం అర్థమైందన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ సోమవారం మీడియాతో మాట్లాడారు.
‘గరీబ్ కళ్యాణ్ యోజన, పీఎం ఆవాస్ యోజన వంటి కేంద్ర సంక్షేమ పథకాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మార్చాలనుకుంటోంది. అట్లా చేస్తే చూస్తూ ఊరుకోబోం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన వంటి సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వంతో ప్రమేయం లేకుండా కేంద్రమే నేరుగా ప్రజలకే అందిస్తుంది. పరిస్థితి అంతవరకు తీసుకురావొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. సంక్షేమ పథకాల అమలు విషయంలో పేదలకు ఎట్టి పరిస్థితిల్లోనూ అన్యాయం చేయబోం. ప్రజలందరికీ కేంద్రమే ఉచితంగా బియ్యం ఇస్తోంది కదా… గరీబ్ కళ్యాణ్ యోజన అని పేరు పెడితే తప్పేంది? ప్రధాని ఫొటో ఎందుకు పెట్టరు? రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఖర్చయ్యే సంక్షేమ పథకాలకు ఏ పేరు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు. అభివృద్ధి విషయంలో కేంద్రం పూర్తిగా సహకరిస్తోంది. గత 10 ఏళ్లలో రూ.12 లక్షల కోట్లకుపైగా కేంద్రం ఖర్చు చేసింది. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే. రైతు భరోసా, కమ్యూనిటీ హాల్, శ్మశాన వాటిక, వీధి దీపాలు, రోడ్ల పైసలన్నీ కేంద్ర ప్రభుత్వానివే. 6 గ్యారంటీలపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేనేలేదు.
మండలానికి ఒక గ్రామంలోనే 4 పథకాలకు ఎంపిక చేసి లబ్ధి చేయడమేంది? మిగిలిన గ్రామాల ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లేయలేదా? రాష్ట్ర ప్రజలకు ఇంత దుర్మార్గంగా చీటింగ్ చేస్తారా? రాష్ట్ర ప్రజలందరికీ లబ్ధి చేకూరుస్తామని చెప్పి మండలానికి ఒక గ్రామానికి లబ్ది చేకూర్చడం నీచం. కాంగ్రెస్ నేతల జేబుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఖర్చు చేస్తున్నారా? ప్రజలు కట్టిన పన్నులతోనే కేంద్రమైనా, రాష్ట్రమైనా ఖర్చు చేస్తోంది కదా? గతంలో పీఎం ఆవాస్ యోజన పేరుతో 2 లక్షల 40 వేల ఇండ్లను కేంద్రం మంజూరు చేస్తే కేసీఆర్ ఒక్క ఇల్లు కట్టకుండా ప్రజలను రోడ్డున పడేసింది నిజం కాదా?. డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసింది నిజం కాదా? పద్మ అవార్డుల జాబితాను పంపేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పంపాలి. గద్దర్‌కు ఎట్లా పద్మ అవార్డు ఇస్తాం? ఎంతో మంది బీజేపీ కార్యకర్తలను కాల్చి చంపించారో తెలియదా? వందల మంది బీజేపీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళన చేస్తే నక్సలైట్లతో కలిసి హత్య చేయించిన వ్యక్తి గద్దర్. కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్‌తో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నాయి. తెలంగాణ సెంటిమెంట్‌తో ఎవరు లాభపడ్డారో, ఎవరు బలైపోయారో ప్రజలందరికీ అర్థమైంది. ఇక ఆ పార్టీల మాటలను ప్రజలు నమ్మరు. అని బండి సంజయ్ పేర్కొన్నారు.