- గురుకుల పాఠశాలలను తహసీల్దార్లు, ఎంపీడీవోలు పర్యవేక్షించాలి
- పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు పటిష్ట చర్యలు
- ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం కామన్ డైట్ అందించాలి
- గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్ పర్యవేక్షణపై కలెక్టర్ సమీక్ష
Rajanna Sirisilla District Collector: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించేలా జిల్లాలోని గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్, కేజీబీవీలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్ పర్యవేక్షణపై అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్‌తో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ ఎస్.కే. ఝా గురువారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్, కేజీబీవీలలో విద్యార్థుల సంఖ్య, ఎంత మంది వంట మనుషులు ఉన్నారు, రోజు ఎంత మంది విధులకు హాజరు అవుతున్నారు, పారిశుద్ధ్య సిబ్బంది, పిల్లల ఆరోగ్య సంరక్షణకు చేపడుతున్న చర్యలు, నాణ్యమైన భోజనం, తాగు నీటి సరఫరా, తదితర వివిధ అంశాలపై కలెక్టర్ చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్, ఏకలవ్య మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇక నుంచి జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తారని తెలిపారు. జిల్లాలోని ప్రతి కేజీబీవీ నిర్వహణను ఆయా మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దారులు, ఎంపీడీవోలు పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలోని బాలికా రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలలో మహిళా సిబ్బంది మాత్రమే విధులు నిర్వహించేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. రానున్న 15 రోజులలో రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రభుత్వ హాస్టల్స్‌లో చదివే విద్యార్థులకు హెల్త్ చెక్ అప్ కోసం షెడ్యూల్ తయారు చేయాలని, ప్రతి నెలా విద్యార్థులకు చెక్ అప్ జరగాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. హాస్టల్స్‌లో పిల్లలకు అవసరమైన కనీస సదుపాయాల కల్పన చర్యలు చేపట్టాలని, డార్మంటరీలో పిల్లల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన మంచాలు, దుప్పట్లు అందుబాటులో ఉండేలా చూడాలని, పిల్లలకు డైనింగ్ ఏర్పాట్లు, హాస్టల్స్ పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. పిల్లల అకడమిక్ సంబంధించి గణితం, సైన్స్, ఆంగ్ల భాషలపై అధికంగా శ్రద్ధ పెట్టాలని కోరారు. కేజిబీవీలోని విద్యార్థులకు ఈ సబ్జెక్టులు ఆన్‌లైన్ ద్వారా కోచింగ్ అందిస్తున్నామని, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సంతాప దినాలు ముగిసిన తర్వాత ఈ కోచింగ్ సౌకర్యాన్ని మిగిలిన రెసిడెన్షియల్ పాఠశాలలకు విస్తరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లోని స్టోర్ రూమ్, క్లీనింగ్ ఏరియా, వంట గది పరిసరాలు సంపూర్ణ పరిశుభ్రంగా ఉండాలని అన్నారు.
గురుకులాలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలను పారిశుద్ధ్య పర్యవేక్షణకు ఫార్మాట్ తయారు చేయాలని కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారికి సూచించారు. పిల్లలకు అందించే ఆహార నాణ్యత అంశంలో రాజీ పడడానికి వీలు లేదని, ఒక సారి వినియోగించిన నూనె మరొక సారి వాడ వద్దని అన్నారు. ఉపాధ్యాయులు కొరత ఎక్కడ ఉన్నా వెంటనే తెలియజేయాలని, పిల్లలు విద్యలో ఎక్కడా వెనుక పడవద్దని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కామన్ డైట్ ప్రకారం సరుకులు సరఫరా చేయని పక్షంలో కాంట్రాక్టర్‌ను చేంజ్ చేయాలని అన్నారు. గురుకులాల నిర్వహణ సంబంధించి ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను ఎప్పటి కప్పుడు మండల స్థాయిలో పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో వేములవాడ రెవెన్యూ డివిజన్ అధికారి రాజేశ్వర్, జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, ఎస్.డి.సి. రాదాబాయి, మండల ప్రత్యేక అధికారులు ఆర్‌సీవోలు ప్రిన్సిపాళ్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
