Rajanna Sirisilla Collector: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, జనవరి 31 (మన బలగం): పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాల ఆవరణ, తరగతి గదులు, మధ్యాహ్న భోజనాలు సిద్ధం చేసే గది, వండే విధానాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం ఈ రోజు ఏ ఏ ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారో ఆరా తీశారు. కూరగాయలు పప్పు, కోడిగుడ్లు సిద్ధం చేస్తుండగా, నాణ్యతను తనిఖీ చేశారు. ఈ రోజు ఎందరు విద్యార్థులు, టీచర్లు హాజరయ్యారో ఆరా తీయగా, మొత్తం 84 మంది విద్యార్థులు, అందరూ టీచర్లు వచ్చారని కలెక్టర్ దృష్టికి ప్రధానోపాధ్యాయులు విద్యాసాగర్ తీసుకెళ్లారు.
విద్యార్థులకు బోధన
స్కూల్‌లోని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గదులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా 10 వ తరగతిలో మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ పాఠాలు బోధించారు. విద్యార్థులకు మ్యాథ్స్ ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టారు. విద్యార్థులను ఉత్తేజ పరిచారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులను సిద్ధం చేయాలని, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ప్రతి పాఠ్యాంశాన్ని క్షుణ్ణంగా వివరించాలని పేర్కొన్నారు.
