KONDAGATTU ANJANEYA SWAMY TEMPLE
KONDAGATTU ANJANEYA SWAMY TEMPLE

KONDAGATTU ANJANEYA SWAMY TEMPLE: ఉత్సవాలకు కొండగట్టు ముస్తాబు

  • 30 నుంచి జూన్ 1 వరకు అంజన్న వేడుకలు
  • అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర్

KONDAGATTU ANJANEYA SWAMY TEMPLE: ఈ నెల 30వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) టీఎస్. దివాకర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హనుమాన్ జయంతి ఉత్సవాలపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 30 నుంచి జయంతి కార్యక్రమాలు జరుగనున్న నేపథ్యంలో 29వ తేదీలోగా ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని, క్రింది స్థాయి ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ నెల 30వ తేదీన భద్రాచలం నుంచి పట్టువస్త్రాలను తెప్పించడం జరుగుతుందని, వాటిని శోభాయాత్ర ద్వారా కళాకారులచే కార్యక్రమాల ద్వారా స్వామి వారికి అలంకరించనున్నట్లు తెలిపారు. దేవాలయాల పరిసరలాలో రంగులు వేయించామని, మూడు రోజుల పాటు లైటింగ్, హోర్డింగ్స్ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఈ నెల 31వ తేదీ రాత్రి నుంచి జూన్ 1వ తేదీ ఉదయం వరకు సుమారు లక్షన్నర మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, 30 వేల మంది మాల విరమణ చేస్తారని తెలిపారు. మూడు రోజుల పాటు 14 కౌంటర్లను ఏర్పాటు చేసి సుమారు 4 లక్షల ప్రసాదాలను అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు.

ఆలయ ప్రాంగణంలో 64 సీసీ కెమెరాలు కెమెరాలు ఉండగా అదనంగా 50 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆరు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉండే విధంగా చూడాలని సూచించారు. మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయని, రోజులు 30 ప్రోగ్రాంలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటాయని తెలిపారు. ఇందుకోసం ఒక వేదికను ఏర్పాటు చేసి 100 మంది కూర్చునే విధంగా సీటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు కొండపైకి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను నాలుగుకు పెంచాలని, ఏడు పార్కింగ్ స్థలాల్లో కచ్చితంగా ట్రిప్స్ వేయాలని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ఆదేశించారు.

కోనేరు వద్ద భక్తులు అధిక సంఖ్యలో స్నానం ఆచరించే వీలు ఉన్నందున ఎప్పటికప్పుడు నీటిని శుభ్రం చేయించాలని మున్సిపల్ అధికారులను, భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని మిషన్ భగీరథ అధికారులను, 24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చూడాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఉదయం ఎండ, సాయంత్రం వాన ఉండడంతో ఎక్కడైనా నీరు నిండి రహదారిలో వెళ్లేందుకు భక్తులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని అన్నారు. కేశఖండనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా కళ్యాణ కట్ట వద్ద 1500 నుంచి 2000 మంది నాయీబ్రాహ్మణులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

పబ్లిక్ టాయిలెట్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుటకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జయంతి ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేసేందుకు షిఫ్టుల వారీగా అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకోవాలని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, జెడ్పీ సీఈవో రఘువరన్, డీఎస్పీ రఘు చందన్, కొండగట్టు ఆలయ ఈవో చంద్ర శేఖర్, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, కలెక్టరేట్ ఏవో హన్మంత రావు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *