Ration card: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 4 (మన బలగం): అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు జారీ చేయాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ రేషన్ కార్డుల జారీపై సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ మాట్లాడుతూ, మన జిల్లాలో ప్రజాపాలన, మీ సేవా, ఇతర మార్గాల ద్వారా రేషన్ కార్డుల జారీ కోసం వచ్చిన 30 వేల 977 దరఖాస్తులను ఆన్ లైన్ లో ఎంటర్ చేయడం జరిగిందని అన్నారు.రేషన్ కార్డు దరఖాస్తుల పై క్షేత్ర స్థాయిలో విచారణ ప్రారంభించాలని అన్నారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఆధారంగా తయారుచేసిన రేషన్ కార్డు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్ లకు పంపారని, మనకు వచ్చిన దరఖాస్తులను స్క్రూటినీ చేసి అర్హులైన వారితో ముసాయిదా జాబితా రూపొందించాలని, గ్రామస్తుల నుంచి అభ్యంతరాలు తీసుకుని వాటిని పరిష్కరించి తుది జాబితా గ్రామసభల ద్వారా ఆమోదింప చేసుకుని రేషన్ కార్డు జారీ చేయాలని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఆహార భద్రత కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని, రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం ఇవ్వాలని అదనపు కలెక్టర్ తెలిపారు.రేషన్ కార్డుల జారీ కోసం వచ్చిన దరఖాస్తుల ధ్రువీకరణ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం అర్హులను మాత్రమే ఎంపిక చేయాలని అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లో రేషన్ కార్డు జారే కావద్దని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారి రాధా భాయి, డి.సి.ఎస్.ఓ. వసంత లక్ష్మి, అన్ని మండలాల తహసిల్దార్లు, సంబంధిత ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.