Nirmal Municipal Commissioner: నిర్మల్, డిసెంబర్ 14 (మన బలగం): నిర్మల్ పట్టణంలోని వ్యాపార సముదాయాలు, ఇతర నిర్మాణాల వారు సెల్లర్లను ఎట్టి పరిస్థితులలో అద్దెలకు ఇవ్వకూడదని, కచ్చితంగా వాటిని పార్కింగ్ నిమిత్తమై ఉపయోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ ముహమ్మద్ ఖమర్ అహ్మద్ సూచించారు. పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, ఇతర కారణాల దృష్ట్యా ప్రజా ఫిర్యాదుల మేరకు దుకాణ సముదాయాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించిన సెల్లర్లను గుర్తించామని తెలిపారు. ఇప్పటికే నిర్మల్ పట్టణంలోని ఆయా అంతర్గత ప్రధాన రహదారులలో ఉన్న దుకాణ సముదాయాలు ఇతర నిర్మాణాల సెల్లర్లను గుర్తించి 50కి పైగా నోటీసులను జారీ చేసామని తెలిపారు. సంబంధిత దుకాణ సముదాయాలు, నిర్మాణాలు ఉన్న ప్రాంతాలకు సంబంధించి ఉన్న వ్యాల్యూ ఆధారంగా 25 శాతం జరిమానాలు వేయవలసి వస్తుందని హెచ్చరించారు. సెల్లర్లను సంబంధిత వాహనాలు ఇతర వాహనాలను పార్కింగ్ చేసేందుకు మాత్రమే ఉపయోగించుకోవడంతో పాటు సదరు దుకాణ సముదాయాలలో మరుగుదొడ్లు మూత్రశాలలు స్థానికంగా ఉండేలా నిర్మాణదారులు, యజమానులు చూసుకోవాలని ఆదేశించారు. ప్రధాన, అంతర్గత రహదారులకు ఆనుకొని ఉన్న దుకాణ సముదాయాలు, ఇతర నిర్మాణాలలో నిర్మించుకున్న సెల్లర్లను గుర్తించి తగిన విధంగా జరిమానాలు వేయడంతో పాటు సెల్లర్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు.