- విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం
- గంగాపూర్ వాగుపై వంతెన నిర్మాణానికి భూమిపూజ
Minister Sitakka: కడెం, డిసెంబర్ 14 (మన బలగం): రెసిడెన్షియల్ పాఠశాలలో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించే దిశగా ప్రభుత్వం కామన్ డైట్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శనివారం డైట్, కాస్మోటిక్స్ చార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్సీ దండే విఠల్, శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్‌లతో కలిసి మంత్రి పాల్గొని, విద్యార్థులతో సహపంక్తి భోజనం చేశారు. పాఠశాలలోని స్టోర్ రూంను సందర్శించి, కూరగాయలు, సరుకులు, ఆహార పదార్థాలను పరిశీలించారు. సన్నబియ్యం, విజయ డెయిరీ పాల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రభుత్వపరంగా ఉచితంగా అందిస్తున్న యూనిఫామ్‌లు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్కులు పరిశీలించి మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ, చక్కగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలలో నిలవాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని, ఉన్నత లక్ష్యాల దిశగా ముందుకు సాగాలన్నారు. అన్ని సంక్షేమ వసతిగృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థిని, విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు వీలుగా ప్రభుత్వం కామన్ డైట్ ప్లాన్‌ను ప్రారంభించిందని తెలిపారు.
వసతిగృహాలు, పాఠశాలల విద్యార్థుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం 40 శాతం డైట్ చార్జీలను, 200 శాతం కాస్మొటిక్ చార్జీలను పెంచడం జరిగిందన్నారు. తద్వారా పిల్లలకు పోషకాలతో కూడిన బలవర్ధక ఆహారం అందాలని, వారు మరింత మెరుగైన విద్యను అభ్యసించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని అన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నామనే భావనను దరి చేరనివ్వకుండా, ఏకాగ్రతతో చదువుకుని జీవితంలో స్థిరపడడం ద్వారా కన్నవారి కలలు నిజం చేయాలని, గురువులకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం డైట్‌చార్జీలను పెంచిందని అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలను ఇక నుంచి అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేస్తారని, కొత్త డైట్ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా? పరిశుభ్రతను పాటిస్తూ నాణ్యమైన ఆహార పదార్థాలు వినియోగిస్తున్నారా లేదా అన్నది పరిశీలిస్తారని అన్నారు.
దశాబ్దాల కల నెరవేరునున్న వేళ
దశాబ్దాలుగా రహదారి సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న గిరిజన గ్రామాలకు రహదారి ఏర్పడి వారి కల నెరవేర నుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అన్నారు. కడెం మండలం గంగాపూర్ వాగుపై రూ.22 కోట్ల 15 లక్షలతో నూతనంగా నిర్మించనున్న వంతెన నిర్మాణానికి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, వంతెన నిర్మాణానికి దశాబ్ద కాలంగా ఎదురుచూసిన గిరిజన ప్రజల కలను ప్రజా ప్రభుత్వం సహకారం చేసిందని అన్నారు. మారుమూల గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్న కళ్యాణి, డీఆర్డీవో విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.