Review of grain purchases: నిర్మల్, నవంబర్ 12 (మన బలగం) : వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్‌తో కలిసి ఆమె సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం, ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియను పూర్తి చేసిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం అమ్మేందుకు వచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
ప్రతీ కొనుగోలు కేంద్రంలో సరిపడినన్ని టార్పాలిన్లు, గన్ని బ్యాగులు, తేమ, తూకపు యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. రైతుల నుంచి ధాన్యం సేకరించిన వెంటనే రశీదు ఇచ్చి, ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వరి మద్దతు ధర, కంట్రోల్ రూమ్ నంబరు, తదితర వివరాలు తెలిపే విధంగా బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించాలన్నారు. వరి ధాన్యాన్ని తీసుకువచ్చినప్పుడే రైతు వద్ద నుంచి ఆధార్, బ్యాంకు ఖాతా తదితర జీరాక్స్ కాపీలను తీసుకొని త్వరితగతిన వారి ఖాతాల్లో డబ్బులు జమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో నిర్మల్, భైంసా ఆర్డీవోలు రత్న కళ్యాణి, కోమల్ రెడ్డిలు, సీపీవో జీవరత్నం, డీఎం సివిల్ సప్లయిస్ వేణుగోపాల్, డీఎస్‌వో కిరణ్ కుమార్, డీసీవో రాజమల్లు, ఏడీ మార్కెటింగ్ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి అంజిప్రసాద్ డీఆర్డీవో విజయలక్ష్మి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.