Nirmal: నిర్మల్, ఫిబ్రవరి 19 (మన బలగం): పన్ను వసూలును వంద శాతం పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్మల్ పట్టణంలో వివిధ కాలనీలలో జరుగుతున్న పన్నుల వసూలు, వాణిజ్య లైసెన్సుల పునరుద్ధరణ ప్రక్రియను మున్సిపల్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఆస్తి పన్నుతో సహా అన్ని రకాల పన్నులను సకాలంలో చెల్లించాలని వ్యాపారస్తులకు సూచించారు. నిర్ణీత గడువులోగా వాణిజ్య లైసెన్సులను పునరుద్ధరించుకోవాలన్నారు. సకాలంలో పన్నులను చెల్లించని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
దివ్య నగర్ పార్కును సుందరంగా తీర్చిదిద్దాలి
దివ్యగార్డెన్ కాలనీలోని అర్బన్ పార్కును పరిశీలించి పార్కు అభివృద్ధికి పలు కీలక సూచనలు చేశారు. ప్రజలను ఆకట్టుకునే విధంగా పార్కును తీర్చిదిద్దాలన్నారు. పార్కు సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణ నడిబొడ్డున పార్క్‌కు అనుకూలమైన ప్రదేశం అయినందున దివ్య నగర్ పార్కుపై ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. త్వరలోనే పనులను చేపట్టి పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమాలలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, డీఈ హరి భువన్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.