BJP Nirmal District President: నిర్మల్, ఫిబ్రవరి 19 (మన బలగం): భారతీయ జనతా పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షునిగా మాజీ ఎంపీ దివంగత రమేశ్ రాథోడ్ కుమారుడు రాథోడ్ రితీష్‌ను నియమిస్తూ రాష్ట్ర పార్టీ బుధవారం ఆదేశాలు జారీచేసింది. రాథోడ్ రితీష్, రమేష్ రాథోడ్ తనయుడిగా, యువనేతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1985లో జన్మించిన రితీష్ హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో రాజకీయ వారసునిగా 2014లో తెలుగు దేశం పార్టీ తరఫున ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు. అప్పటి నుంచి తండ్రి వెన్నంటి నడుస్తూ ప్రజా సేవలో పాల్గొంటూ, తండ్రికి తగ్గ తనయుడిగా, యువనేతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2020 లో తన తండ్రితో పాటు రాథోడ్ రితీష్ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనతి కాలంలో బీజేపీ రాష్ట్ర నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, రాష్ట్ర ఎస్టీ మోర్చా నాయకులుగా పార్టీ కార్యక్రమాలు కొనసాగించారు. కర్ణాటక, మునుగోడు, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ కీలక బాధ్యతలు అప్పజెప్పడంతో రాథోడ్ రితీష్ ఎన్నికల్లో చురుకైన పాత్ర పోషించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టిలో మంచి పేరు తెచ్చుకున్నారు. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మరణం తర్వాత బీజేపీ ఖానాపూర్ అసెంబ్లీ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ రాథోడ్ రితీష్‌ను నిర్మల్ జిల్లా అధ్యక్షునిగా ప్రకటించడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రాథోడ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.