Minister Seethakka
Minister Seethakka

Minister Seethakka: ట్రిపుల్‌ ఐటీ సమస్యలు పరిష్కరిస్తాం: జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క

  • అధికారులతో మంత్రి సమీక్ష
  • పాల్గొన్న ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

Minister Seethakka: ముధోల్, డిసెంబర్ 13 (మన బలగం): ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క తెలిపారు. శుక్రవారం ట్రిపుల్ ఐటీని సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తన ద‌ృష్టికి వచ్చిన సమస్యలు దశలవారీగా పరిష్కరించి ట్రిపుల్ ఐటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గత ప్రభుత్వం ట్రిపుల్ ఐటీని ట్రబుల్ ఐటీగా మార్చిందని మండిపడ్డారు. మసకబారిన ట్రిపుల్ ఐటీ ప్రతిష్టను ఉన్నతస్థాయికి తీసుకెళ్తామని వివరించారు. తక్షణ అవసరాల కోసం రూ.కోట నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. వీసీ, కలెక్టర్, ఎస్పీ అందరు అధికారులు అందుబాటులో ఉంటారని, ఏ సమస్య ఎదురైనా విద్యార్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచనలను పరిగణలోకి తీసుకొని విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు లక్ష్య సాధనతో చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడాలన్నారు.

రూ.50 కోట్ల నిధులు ఇవ్వాలి: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
పది సంవత్సరాల కాలంలో గత పాలకులు బాసర ట్రిపుల్ ఐటీని భ్రష్టు పట్టించారని, ఇకనైనా దృష్టి సారించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కను కోరారు. మంత్రి సీతక్క ట్రిపుల్ ఐటీలో అధికారులతో సమీక్షించిన సందర్భంగా మాట్లాడారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మూలంగానే ట్రిపుల్ ఐటీ ఏర్పాటైందని, ఆయన సేవలను ఇక్కడి ప్రాంతవాసులు ఎన్నటికీ మర్చిపోరన్నారు. ఏడు కోట్ల రూపాయలతో నాలుగు సంవత్సరాల క్రితం సోలార్ ప్లాంట్ ఏర్పాటు అయితే, ఇప్పటికీ ప్రారంభించకపోవడం శోచనీయమన్నారు. పాలన విభాగంలో కిందిస్థాయి అధికారులతో పనులు చేయించడం సరికాదన్నారు. ట్రిపుల్ ఐటీ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు ఇవ్వాలని కోరారు. విద్యార్థులకు మినీ స్టేడియం ఏర్పాటు చేయాలన్నారు. త్రిబుల్ ఐటీకి తాను స్వయంగా పలుమార్లు వచ్చి పరిశీలించాలని, వాష్ రూమ్‌లతోపాటు పలు సౌకర్యాలు లేవన్నారు.
అక్రమాలపై విచారణ చేపట్టండి: విద్యార్థులు
పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ హయాంలో బాసర ట్రిపుల్ ఐటీలో అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణ జరిపించాలని విద్యార్థులు మంత్రి సీతక్కను కోరారు. విచారణ జరిపి అక్రమాలకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ట్రిపుల్ ఐటీ భ్రష్టు పట్టడానికి కారణం అప్పటి పాలకులేనన్నారు. 9000 మంది విద్యార్థులు ఉన్నారని, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. సమావేశంలో విద్యార్థులు గత పాలకులు అని మాటిమాటికి అనడం, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అక్కడే ఉండడం కొసమెరుపు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *