Report on GO 317: మనబలగం, తెలంగాణ బ్యూరో: వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయుల ఉసురు పోసుకున్న గత ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోపై, ప్రస్తుత ప్రభుత్వ కేబినెట్ సబ్ కమిటీ తుది నివేదిక ఎట్టకేలకు ముఖ్యమంత్రి చెంతకు చేరింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన 317 జీవోపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు నిష్ణాతులైన మేధావులతో సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల అభిప్రాయాలను కేబినెట్ సబ్ కమిటీ వినతుల రూపంలో ప్రత్యక్షంగా, వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్లు స్వీకరించింది. వారి సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించి తుది నివేదిక పత్రాలను సీల్డ్ కవర్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదివారం కలిసి అందజేశారు.