Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay: గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు

  • న్యాయం చేయమంటే లాఠీలతో కొట్టిస్తారా?
  • రేవంత్ సర్కార్ మనుగడ కష్టమే!
  • చేసిన తప్పును రేవంత్ రెడ్డి సరిదిద్దుకోవాలి
  • సామాన్య కార్యకర్తగా అశోక్ నగర్ వెళ్లి నిరుద్యోగులకు అండగా ఉంటా
  • గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాల్సిందే
  • హైడ్రా పేరుతో బెదిరింపులు డబ్బులు దండుకోవడానికే
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందూదొందే
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

Bandi Sanjay: మనబలగం, తెలంగాణ బ్యూరో: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనతో కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడే ప్రశ్నార్థంగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు సీఎం సీటు కోసం గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. గ్రూప్-1 అభ్యర్థుల గొడవ ఉధృతమై ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటున్నారని చెప్పారు. గ్రూప్-1 అభ్యర్థులు చేస్తున్న ఆందోళన పూర్తిగా న్యాయమైందేనని, వారికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. నిరుద్యోగులపై లాఠీఛార్జ్ అమానుషమన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ నిరుద్యోగుల వద్దకు సామాన్య కార్యకర్తగా వెళ్లి అండగా ఉంటానని చెప్పారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం 29 జీవోను ఉపసంహరించుకుని, గ్రూప్-1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు.

కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా నేతలతో కలిసి బండి సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరుపై నిప్పులు చెరిగారు. ‘గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసుల లాఠీఛార్జ్ దుర్మార్గం. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులపై రాక్షసంగా వ్యవహరిస్తోంది. గుంజుకొచ్చి మరీ పోలీసులతో కొట్టిస్తారా? నిరుద్యోగులు చేసిన తప్పేంది? మానవతా ధృక్పథంతో వ్యవహరించాల్సిన ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తుందా? కాంగ్రెస్ ను నమ్మి లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటే ఇట్ల చేస్తరా? జీవో 29 నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. జీవో 29 జారీ చేసినోళ్లకు బుద్దిలేదు. రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తరా? కాంగ్రెస్ అనాలోచిత, దుర్మార్గపు, చిల్లర నిర్ణయమిది. నిరుద్యోగుల పొట్ట కొట్టడానికే 29 జీవో జారీ చేశారు. ఈ జీవోను సవరించి న్యాయం చేయమని అడిగితే కొట్టిస్తారా? గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేస్తే తప్పేంది.

బీఆర్ఎస్ సర్కార్ కు, కాంగ్రెస్ పాలనకు తేడా ఏముంది? హామీలిచ్చుడు, మోసాలు చేయడంలో రెండు పార్టీలు నెంబర్ వన్. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లయినా గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనేలేదు. కేసీఆర్ ఆలోచనా విధానానికి అనుగుణంగానే కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. రెండు పార్టీలకు ఉద్యోగాలను భర్తీ చేసే ఆలోచనే లేదు. తప్పుడు నోటిఫికేషన్లు, పరీక్షా పత్రాల్లో తప్పులు, తప్పుడు జీవోలతో నిరుద్యోగులతో జీవితాలతో చెలగాటమాడుతున్నారు. నిరుద్యోగుల మధ్య చిచ్చుపెట్టి కొట్టుకునేలా చేసి లబ్ది పొందేందుకే జీవో నెంబర్ 29 జారీ చేశారు. నిరుద్యోగుల బ్రాండ్ అంబాసిడర్ లాగా కేటీఆర్ ఫోజు కొట్టడం సిగ్గు చేటు. దొంగ నోటిఫికేషన్లతో నిరుద్యోగుల ఉసురు పోసుకునేలా చేసిన చరిత్ర బీఆర్ఎస్ ది. ఆ పార్టీకి నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేనేలేదు. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునేలా వంచించిన పార్టీ బీఆర్ఎస్ ది. తక్షణమే 29 జీవోను ఉపసంహరించుకోవాలి. గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాల్సిందే.

లేనిపక్షంలో నిరుద్యోగులకు అండగా నేనుంటా. కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్ అశోక్ నగర్ వెళ్లి నిరుద్యోగుల ఆందోళనకు మద్దతిస్తా. సమస్య జఠిలం కాకుండా సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలే తారుమారు అవుతాయి. గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రమాదకర పరిస్థితిలో పడబోతోంది. నిరుద్యోగులతోపాటు వాళ్ల కుటుంబాలు, బీజేపీ కార్యకర్తలంతా అండగా ఉంటారు. నిరుద్యోగుల పక్షాన అవసరమైతే నేను కూడా ఆందోళనలో పాల్గొంటా. కేంద్ర మంత్రి పదవి సంగతి తరువాత. నాకు నిరుద్యోగుల జీవితాలే ముఖ్యం. నిరుద్యోగులపై లాఠీచార్జ్ చూసి బాధపడుతున్న. కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ ఒక కార్యకర్తగా నిరుద్యోగుల వద్దకు వెళ్లి మద్దతిస్తా. మూసీపై కేటీఆర్ పవర్ ప్రజెంటేషన్ ఓ జోక్. మూసీపై కేసీఆర్ ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నేతలు మర్చిపోయి నట్లున్నరు. మూసీపై సీఎం రేవంత్ రెడ్డి రోజుకో మాట మారుస్త్తూ గజినీలా మారుతున్నడు. మూసీ సుందరీకరణకు రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తానని చెప్పింది రేవంత్ రెడ్డే. మూసీ ప్రక్షాళనకు ప్రపంచ బ్యాంకు నుండి అప్పు కోసం సాగిలపడుతోంది కాంగ్రెస్సే.

ఆనాడు కమ్యూనిస్టులతో కలిసి ప్రపంచబ్యాంకు జీతగాడు.. చంద్రబాబు మోసగాడని ఉద్యమించింది కాంగ్రెస్సే. నేడు అప్పు కోసం ప్రపంచబ్యాంకు ముందు మోకరిల్లుతోంది కాంగ్రెస్సే మూసీ పేరుతో లక్షన్నర కోట్ల దోపిడీకి బీజేపీ వ్యతిరేకం. మూసీ పేరుతో 11 వేల ఇండ్లను కూల్చడానికి వ్యతిరేకం. కాంగ్రెస్ కు చేతనైతే..11 వేల కుటుంబాలకు ఇండ్లు కేటాయించి, అన్ని విధాలా ఆదుకోవాలి. ఆ కుటుంబాల జీవనోపాధికి ఢోకా లేకుండా చేసిన తరువాతే మూసీ ప్రక్షాళనకు పూనుకోవాలి. హైడ్రా పేరుతో ఇండ్లను కూల్చేస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. అక్రమ లే అవుట్ల పేరుతో హైడ్రా సర్వే నెంబర్లను రిలీజ్ చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. స్టాంప్ డ్యూటీ వసూలు చేసి ఆ ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసింది ప్రభుత్వమే. మళ్లీ ఆ భూములే అక్రమ లే అవుట్లు అంటూ ప్రజలకు గుండె పోటు వచ్చేలా చేస్తారా?. ప్రభుత్వానికి దమ్ముంటే అక్రమ లేఅవుట్లను రిజిస్ట్రేషన్ చేసిన అధికారులను, బాధ్యులను జైలుకు పంపండి. హైడ్రా నడవాలే.. మూసీ ప్రక్షాళన గొడవ కావాలే.. గ్రూప్ 1 గొడవ పెద్దది కావాలని కాంగ్రెస్ నేతలే కోరుకుంటున్నరు.

కొంతమంది కాంగ్రెస్ నేతలు సీఎం సీటు కోసం గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నరు. గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదకర పరిస్థితిలో పడిపోయేలా ఉంది. గ్రూప్ 1 ఆందోళనలు తారాస్థాయికి చేరుకోవాలని కాంగ్రెస్ లోనే కొందరు నేతలు కోరుకుంటున్నరు. గ్రూప్ 1 గొడవను తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నరు. సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నా. గ్రూప్ 1 విషయంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలి. జీవో 29ను వెంటనే ఉపసంహరించుకోవాలి.’ అని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *