Flood Relief for Farmers Nirmal: ఇటీవలి కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య స్పష్టం చేశారు. బుధవారం సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో తెగిపోయిన పెద్ద చెరువు కట్టను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి పరిశీలించిన ఆయన, రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాగు ప్రవాహాలను దాటి చెరువు గట్టుకు చేరుకున్న చైర్మన్, కలెక్టర్ పంట నష్టంపై పరిశీలన జరిపారు. రైతుల బాధలు విన్న అనంతరం చైర్మన్ మాట్లాడుతూ, ఏ ఒక్క రైతూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పంట నష్టానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు.
అదేవిధంగా వరద ప్రవాహానికి దెబ్బతిన్న రహదారులను మరమ్మతు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు నష్టపోయిన సుమారు 300 ఎకరాల పంటకు సంబంధించిన నివేదికను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ… చెరువుగట్టుకు మరమ్మతులు తక్షణమే చేపడతామని తెలిపారు. రహదారి పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వీలైనంత త్వరగా పంట నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, రెవెన్యూ, ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
