Whip Laxman Kumar: ధర్మారం, జనవరి 21 (మన బలగం): ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంగా సోమవారం రోజున ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాఠశాలను సందర్శించి విద్యార్థులను సన్మానించారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన టీ.మనోజ్ఞ ఫుట్ బాల్ క్రీడలో జమ్ము కాశ్మీర్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. బి.సింధు ప్రియా వాలీబాల్ క్రీడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో జరిగిన జాతీయ స్థాయిలో పాల్గొన్నారు. బి.వైష్ణవి సాఫ్ట్ బాల్ ఎస్‌జీఎఫ్ అండర్ 19 మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. ఓ.సౌజ్ఞ శ్రీ గుజరాత్ రాష్ట్రంలో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొ్న్నారు. ఏ రంజిత్ కుమార్ బీహార్ రాష్ట్రంలో జరిగిన జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొన్నారు. బి.అశ్రిత గుజరాత్ రాష్ట్రంలో జరిగిన జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొన్నారు. సుమారు 30 మంది రాష్ట్ర స్థాయి పోటీల్లో, ఆరుగురు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. వారికి శిక్షణ ఇచ్చిన పీఈటీలను, స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను విప్ అభినందించారు. ఈ సందర్భంగా 24 నుంచి 27 వరకు మహారాష్ట్రలో జరిగే జాతీయస్థాయి అండర్ 19 ఎస్‌జీఎఫ్ పోటీల్లో పాల్గొననున్న బి.వైష్ణవికి ప్రయాణ ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు అందిస్తామని తెలిపారు. పాఠశాలకు సంబంధించిన కంప్యూటర్ ల్యాబ్ కోసం ఒక నెల జీతాన్ని చెక్కు రూపంలో ప్రిన్సిపాల్‌కు అందిస్తామని వెల్లడించారు. అదే విధంగా పాఠశాలకు క్రీడా ప్రాంగణాన్ని, పాఠశాల ఆవరణలో జిమ్ము ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.