District Collector Abhilasha Abhinav: నిర్మల్, ఫిబ్రవరి 24 (మన బలగం): మహిళా సాధికారితకు బ్యాంకులు చేయూతను అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బ్యాంక్ అధికారులను ఆదేశించారు. సోమవారం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో సమావేశం ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నేటి నుంచి ఈ నెల 28 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళల ఉన్నతి కోసం బ్యాంకులు ఎన్నో రకాల సదుపాయాలను కల్పిస్తున్నాయని తెలిపారు. మహిళలకు సంబంధించి ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న అన్ని రకాల పథకాలపై మహిళలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. స్వయం సంఘాలకు చేయూతనివ్వడానికి ఎన్నో పథకాలు ఉన్నాయని, మహిళా సాధికారిత సాధించడానికి ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు. మహిళలకు పొదుపుపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బ్యాంకు సహకారంతో మహిళలు వాణిజ్య, వ్యాపార రంగాల్లో రాణించగలుగుతున్నారని తెలిపారు. ఆర్థిక అక్షరాస్యతపై మహిళలు అందరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 25న మంగళవారం 2కే రన్ నిర్వహించాలని, యువత, మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం అధికారులతో కలిసి కలెక్టర్ ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్, ఆర్డిఓ రత్న కళ్యాణి, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఈవో పి.రామారావు, వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, డీఎంహెచ్‌వో రాజేందర్, డీవైఎస్‌వో శ్రీకాంత్ రెడ్డి, డీహెచ్ఎస్‌వో రమణ, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.