Petition to the Collector: నిర్మల్, జనవరి 24 (మన బలగం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం గ్రామసభలు నిర్వహిస్తుండగా ఉపాధి హామీ సిబ్బంది లబ్ధిదారుల పేర్లను చదివే సమయంలో అకారణంగా దాడి చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని శుక్రవారం జిల్లా కలెక్టర్ అభినవ అభిలాష, అదనపు కలెక్టర్ పైజాన్ హైమద్, డిఆర్డిఓ విజయలక్ష్మి గార్లకు జిల్లా ఉపాధి హామీ సిబ్బంది యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. సొన్ మండలం సకెర గ్రామ పంచాయతీలో. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గ్రామ సభలో ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, నర్సాపూర్ మండలం టెంబుర్ని గ్రామపంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్ లపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి వారి పైన చర్యలు తీసుకోవాలని కోరారు. సక్రమంగా విధులు నిర్వహిస్తున్న మాపై దాడులు చేయటం భయాందోళనలకు గురి చేయటం తో రక్షణ లేకుండా ఉందని వాపోయారు. ఇలాంటి సిబ్బందిపై దాడులు పునరావృతం కాకుండా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని తగు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభినవ అభిలాష స్పందిస్తూ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై దాడి చేయటం తగదని దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి హామీ సిబ్బంది ఏపీవోలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.