- ప్రతి రోజూ పంచాయతీ కార్యదర్శి కనీసం 25 ఇండ్ల దరఖాస్తుల సర్వే చేయాలి
- డిసెంబర్ 31 లోగా సర్వే పనులు పూర్తి చేయాలి
- ఇందిరమ్మ ఇండ్ల సర్వే పై సమీక్ష నిర్వహించిన కలెక్టర్
Survey of Indiramma houses: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: జిల్లాలో నిర్దేశిత సమయంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై సంబంధిత అధికారుల, పంచాయతీ కార్యదర్శులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, సిరిసిల్ల జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా ఇందిరమ్మ ఇండ్ల కోసం 1లక్షా 7వేల 398 దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటి వరకు వీటిలో 15వేల 510 దరఖాస్తుదారుల ప్రస్తుత నివాసం ఇందిరమ్మ యాప్లో క్యాప్చర్ చేయడం జరిగిందన్నారు. ప్రతి రోజూ పంచాయతీ కార్యదర్శి 25 ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే పూర్తి చేయాలని, గ్రామాల్లో అవసరమైతే అదనపు లాగిన్లు తీసుకుని సర్వే వేగవంతం చేయాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. అనంతరం జిల్లాలోని మండలాల్లో వివిధ గ్రామాల్లో జరుగుతున్న సర్వే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సెల్ టవర్ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఎదురైతే ఆఫ్ లైన్ ద్వారా కూడా నమోదు చేయవచ్చని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే వేగవంతంగా పూర్తి చేయాలని, నిర్దేశిత సమయం డిసెంబర్ 31లోగా సర్వే పనులు పూర్తి కావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్చార్జి జిల్లా పంచాయతీ అధికారి శేషాద్రి, ఎం.పి.డి.ఓ లు, పంచాయితి కార్యదర్శులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.