కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు
Juvvadi Narsingrao: ఇబ్రహీంపట్నం, నవంబర్ 5 (మన బలగం): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అసలైన అర్హులకు అందించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపడుతోందని, ప్రజలు ఈ సర్వేకు సంపూర్ణంగా సహకరించాలని కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు కోరారు. మంగళవారం పాత్రికేయులకు పత్రిక ప్రకటనను ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కుల గణన ఇంటింటి సమగ్ర సర్వేకు సర్వం సిద్ధమైందన్నారు. ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న సామాజిక, విద్య, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 80 వేల మంది సేవలను వినియోగించుకోవాలని సర్కారు నిర్ణయించిందని తెలిపారు. ఈ నెల 6 నుంచి మూడు వారాల పాటు కుల గణన సమగ్ర సర్వే నిర్వహించనున్నారన్నారు. కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో సమగ్ర సర్వే నిర్వహించకపోవడంతో అసలైన అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇంటింటి సర్వే నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి అసలైన అర్హులను గుర్తించడం జరుగుతుందన్నారు. సర్వే కోసం ఇంటింటికి వచ్చే అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి సంపూర్ణంగా సహకరించి అడిగిన ప్రతి వివరాలను అందించాలని కోరారు. అదేవిధంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను అందించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం పేరిట అర్హులకు కాకుండా కేవలంతో పార్టీ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే ఇళ్లను అందించారని విమర్శించారు. తమ ప్రజా ప్రభుత్వం అర్హులు అయిన ప్రజలను గుర్తించి పేదలకు మాత్రమే ఇండ్లను అందిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కోరుట్ల నియోజకవర్గం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.