Christian Minority Welfare Schemes in Nirmal Telangana: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన క్రైస్తవ, మైనారిటీలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కమిషన్ చైర్మన్ దీపక్ జాన్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో క్రైస్తవ మైనారిటీల సమస్యలపై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సమక్షంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని క్రైస్తవులు అభివృద్ధి సాధించాలని అన్నారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాలలో చర్చి నిర్మాణాల కోసం స్థలాల కేటాయింపు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, క్రైస్తవుల కుల, వివాహ ధ్రువీకరణ పత్రాల మంజూరు, సమాధుల కోసం స్థలాల కేటాయింపు తదితర అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్రైస్తవ మైనారిటీల సమస్యల పరిష్కారానికి తగిన సిఫారసులు ప్రభుత్వానికి పంపుతామని హామీ ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్రైస్తవ మైనార్టీల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్హులైన క్రైస్తవులకు ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేలా సంబంధిత శాఖాధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. చర్చి, కమ్యూనిటీ హాల్ నిర్మాణ అనుమతుల విషయంలో అవసరమైన చర్యలు చేపడతామని కలెక్టర్ స్పష్టం చేశారు. అంతకు ముందు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్లు తమ సమస్యలను కమిషన్ చైర్మన్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్, చైర్మన్‌ను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మోహన్ సింగ్, అసోసియేట్ పాస్టర్లు, జిల్లా స్థాయి క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
