Collector Sandeep Kumar Jha: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 17 (మన బలగం): ప్రజావాణి అర్జీలకు వేగంగా పరిష్కారం చూపాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లా అధికారులకు సూచించారు. నిర్ణీత గడువులోగా వినతులు పరిష్కరించాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌హాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పరిష్కరించాలని సూచించారు. ఆయా శాఖలకు వచ్చిన దరఖాస్తుల వివరాలు.. రెవెన్యూ శాఖకు – 52, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్‌కు- 14, జిల్లా సంక్షేమ అధికారి, ఉపాధి కల్పన అధికారికి 6 చొప్పున, ఎంపీడీఓ కోనరావుపేటకు 4, జిల్లా వైద్యాధికారి, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి, డీఆర్ డీఓ, విద్యా శాఖకు మూడు చొప్పున, వ్యవసాయ శాఖ, సెస్, ఎస్పీ కార్యాలయం, ఎంపీడీవో తంగళ్లపల్లికి రెండు చొప్పున, అటవీ శాఖ, ఎస్డిసీ, ఆర్టీఓ, మైన్స్ ఏడీ, ఆర్ సీఓ, ఎక్సైజ్ శాఖ, ఎస్సీ కార్పొరేషన్, మత్స్య శాఖ, జిల్లా పౌర సరఫరాల అధికారి, ఎంపీడీవో వీర్నపల్లి, చందుర్తి, వేములవాడ, గంభీరావుపేట బోయినపల్లికి ఒకటి చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ప్రజావాణిలో వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్, డీ.ఆర్డీ.ఓ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.