- గ్రిల్ నైన్ బిర్యాని తిన్న 100 మందికి పైగా అస్వస్థత
- రెండ్రోజుల క్రితం ఒకరు మృతి
- తాజాగా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు
- అపరిశుభ్రత, కాలం చెల్లిన సామగ్రి స్వాధీనం
- హార్డ్ డిస్క్, సీసీ ఫుటేజీ మాయం
- హోటల్‌ను సీజ్ చేసిన అధికారులు
Food Poison: నిర్మల్, నవంబర్ 7 (మన బలగం): ఏది తిందాం అన్నా, ఏది కొందామన్నా అంతా కల్తీమయం.. అసలు ఏదో.. నకిలీ ఏదో గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొంది. అయినా కొనక తప్పడం లేదు. తినక తప్పడం లేదు. తత్ఫలితంగా అనారోగ్యాలను కొని తెచ్చుకోవడం.. ఆసుపత్రిపాలవడం తప్పడం లేదు. హోటల్‌లో టిఫిన్ చేద్దామన్నా, భోజనం చేద్దాం అన్నా భయపడాల్సి వస్తోంది. కిరాణా సరుకులు కొందాం అన్నా జంకాల్సిందే. నకిలీ సరుకులు, నకిలీ మనుషుల మధ్య బతకడమే నరకం అవుతోంది.
నిర్మల్ పట్టణంలోని హోటళ్లలో కల్తీ ఆహార పదార్థాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. నకిలీ సరుకులు, కాలం చెల్లిన వస్తువులను వినియోగించి తయారుచేసిన ఆహార పదార్థాలను తిని ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. తాజాగా పట్టణంలోని ఏఎన్ రెడ్డి కాలనీ కమాన్ పక్కనే ఉన్న గ్రిల్ నైన్ హోటల్‌లో ఈ నెల 2వ తేదీన బిర్యానీ తిన్న సుమారు 100 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒకరు మృతి చెందగా పదుల సంఖ్యలో నేటికీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
100 మందికి పైగా అస్వస్థత
నిర్మల్ పట్టణంలోని గ్రిల్ నైన్ హోటల్లో మండి బిర్యాని తిన్న 100 మంది అస్వస్థతకు గురయ్యారు. బోత్ ఎక్స్ రోడ్ సమీపంలోని ఒక పాఠశాలలో పనిచేసే మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ ఈ నెల 2వ తారీఖున బిర్యాని తిని అస్వస్థత గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మృతి చెందింది. అయితే ఈనెల 2వ తేదీన తిన్నవారిలో ఎక్కువ శాతం మంది అస్వస్థతకు గురయ్యారు. సుమారు వందమందికి పైగానే అస్వస్థతకు గురై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొందరికి నయంకాగా మరికొందరు నేటికీ ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చేరిన వారు ఉన్నారు. ఇంకా ఒకరిద్దరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేక అనేకమంది అప్పులు చేయడం, బంగారాలను తాకట్టు పెట్టుకొని రుణాలు తీసుకొని వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. నిర్మల్ పట్టణంలోని గాజులపేట కాలనీకి చెందిన సోఫియాన్, ప్రియదర్శిని నగర్‌కు చెందిన ఎండీ సలీం కుటుంబ సభ్యులు, లలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండడంతో బంగారు నగలను ఫైనాన్స్‌లో తాకట్టుపెట్టి రుణాలు తీసుకొని చికిత్స చేయించుకుంటున్నామని వాపోయారు.
ఫుడ్ ఇన్‌స్పెక్ట్ తనిఖీలు
నిర్మల్ పట్టణంలోని గ్రిల్ నైన్ హోటల్లో గురువారం ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ప్రత్యూష తనిఖీలు నిర్వహించారు. హోటల్‌లో మిగిలిపోయిన పదార్థాలు, నూనెలు, వివిధ రకాల సామాన్లను పరిశీలించారు. వాటిలో కాలం చెల్లిన సాస్, ఇతర వంట సామాన్లు ఉన్నట్లు వెల్లడైంది. అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉంది. నాన్ వెజ్‌ను నిలువ ఉంచే ఫ్రిడ్జ్ దుర్గంధమైన వాసన వెదజల్లుతోంది. హోటల్లోని ప్రతి అంగుళం అపరిశుభ్రతతో నిండిపోయి ఉంది. కేవలం ధనార్జనే దేయంగా హోటల్‌ను నడిపించారే తప్ప ప్రజల ప్రాణాల గురించి ఆలోచించలేదని పలువురు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. పట్టణంలోని దాదాపు అన్ని హోటల్లో పరిస్థితి ఈ విధంగానే ఉందని ప్రజలు ఫుడ్ ఇన్‌స్పె్క్టర్‌కు ఫిర్యాదు చేశారు. ముమ్మర తనిఖీలు చేసి నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు ఫిర్యాదులు చేశారు.
సీసీ ఫుటేజ్ మాయం
నిర్మల్ పట్టణంలోని గ్రిల్ నైన్ హోటల్లో ఫుడ్ పాయిజన్‌తో ఓ మహిళ మృతి చెందగా, మరో వందమందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. గురువారం సీసీ ఫుటేజ్ చూసేందుకు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ప్రయత్నించగా అప్పటికే హార్డ్ డిస్క్‌ను తొలగించారు. ఈ నెల 2వ తేదీన ఫుడ్ పాయిజన్ కాగా ఆరోజు ఫుటేజీ మొత్తం డిలీట్ చేశారు. దీంతో ఆ రోజు ఎంత మంది భోజనం చేశారు, ఆ రోజు హోటల్‌కు ఎంతమంది వచ్చారు అనే సమాచారం లేకుండా చేశారు. ఈ విషయమై హోటల్ యాజమాన్యంపై ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సీరియస్ అయ్యారు.
గ్రిల్ నైన్ హోటల్ సీజ్
ఈనెల 2వ తేదీన మండి బిర్యాని తిని అస్వస్థతకు గురై ఒకరు మృతి చెందడానికి కారణమైన గ్రీల్ నైన్ హోటల్లో గురువారం ఫుడ్ ఇన్‌స్పె్క్టర్, మున్సిపల్ కమిషనర్ తనిఖీలు నిర్వహించి సీజ్ చేశారు. జిల్లా ఉన్నతాధికారులకు నివేదికలు అందజేస్తామని స్పష్టం చేశారు.