- శివరాత్రి నాటికి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు ప్రారంభించాలి
- భక్తులకు వేగంగా దర్శనం, మంచి వసతి, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పనకు కృషి
- అంబేద్కర్ జంక్షన్ వద్ద కాంస్య విగ్రహం ఏర్పాటుకు చర్యలు
- వేములవాడ ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వ విప్ సమీక్ష
Whip Adi Srinivas: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: ఆధ్యాత్మిక పట్టణంగా వేములవాడ అభివృద్ధి అయ్యే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మిని సమావేశ మందిరంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి వేములవాడ ఆలయ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. బద్ది పోచమ్మ ఆలయం పునరుద్దరణ పనులు, శివార్చన వేదిక నిర్మాణం, గుడి చెరువు మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి, వేములవాడ- కోరుట్ల, వేములవాడ వట్టెం ల రోడ్డు విస్తరణ పనులు, మూడవ బ్రిడ్జి నుంచి రాజ రాజేశ్వర స్వామి దేవాలయానికి రోడ్డు విస్తరణ పనులు, భక్తులకు ఆధునిక వసతుల కల్పన, అన్నదానం భవన నిర్మాణం, అంబేద్కర్ జంక్షన్, జయవరం లేఔట్ అభివృద్ధి వంటి సుమారు 199.49 కోట్ల విలువ గల పనులపై ప్రభుత్వ విప్ శ్రీనివాస్ సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆలయ కార్యాలయంలో సామాగ్రి ఫర్నిచర్ కొనుగోలు చేయమని సంవత్సరం క్రితం ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు చేయలేదని ఆయన ఆలయ అధికారులపై మండిపడ్డారు. సంక్రాంతి నాటికి అన్నదాన భోజన హాల్, సమావేశ మందిరంలో నూతన ఫర్నీచర్ అందుబాటులో తీసుకుని రావాలని అన్నారు. ఆలయం వద్ద భక్తుల వసతి కోసం సూట్ రూమ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.
భక్తుల వసతి దగ్గర పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, దోమలు వంటి సమస్యలు రాకుండా రెగ్యులర్ ఫాగ్గింగ్ జరగాలని అన్నారు. బద్ది పోచమ్మ ఆలయం వద్ద బోనాలు, పట్నాల మండపాలు, వేయిటింగ్ హల్ నిర్మాణానికి 39 గుంటల భూమి సేకరించామని, 9 కోట్ల 90 లక్షలతో చేపట్టిన బద్ది పోచమ్మ పునరుద్దరణ పనులు త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గుడి చెరువు విస్తరణ కోసం 34 ఎకరాల పట్టా భూమి సేకరించామని, 12 కోట్లతో గుడి చెరువు మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి, ఫ్యామిలీ థియేటర్, విగ్రహం, నీటి సరఫరా, విద్యుత్, ల్యాండ్ స్కేపింగ్, వాకింగ్ ట్రాక్ పనులు శివరాత్రి కన్నా ముందే ప్రారంభం కావాలని అన్నారు. ఒక తీరం వైపు భక్తులు స్నానం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు ఉండాలని, అక్కడ బోటింగ్ సౌకర్యం కూడా మరో తీరం వైపు ఉండే విధంగా మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి జరగాలని అన్నారు. అంబేద్కర్ జంక్షన్ వద్ద చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించి త్వరితగతిన పూర్తి చేయాలని, అక్కడ అంబేడ్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అన్నారు. శివార్చన వేదిక వద్ద అవసరమైన సామాగ్రి, ఇతర పనులు పూర్తిచేయాలని అన్నారు.
వేములవాడ- కోరుట్ల, వేములవాడ -వట్టేమ్లకు 9 కోట్ల 95 లక్షలతో చేపట్టిన 100 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు శివరాత్రి నాటికి పూర్తి కావాలని ప్రభుత్వ విప్ ఆదేశించారు. మూల వాగు బ్రిడ్జి నుంచి దేవాలయం వరకు రోడ్డు విస్తరణ పనులు సకాలంలో పూర్తి కావాలని అన్నారు. ఆలయ విస్తరణకు సంబంధించి డి.పి.ఆర్ పనులు నెలాఖరు నాటికి, అన్నదాన సత్ర భవన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే అందించాలని అన్నారు. వేములవాడకు ఆధ్యాత్మిక శోభ తీసుకుని వచ్చేందుకు వీలుగా ఆలయం బయట ఉన్న గుడి చెరువు అభివృద్ధి, బద్ధి పోచమ్మ, రోడ్డు విస్తరణ పనులు, జంక్షన్ అభివృద్ధి వంటి పనులు శివరాత్రి లోపు ప్రారంభం కావాలని, ఆలయం లోపల విస్తరణ పనులు శివరాత్రి తర్వాత ప్రారంభించేలా ప్రణాళిక తయారు చేయాలని ప్రభుత్వ విప్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, వేములవాడ దేవాలయం సంబంధించి సమావేశ మందిరం, భోజన హల్ లో అవసరమైన ఫర్నిచర్ కు వెంటనే షార్ట్ టెండర్ పిలిచి 3 రోజులలో కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రెండు నెలల కాలంలో గుడి చెరువు దగ్గర చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, వేములవాడ ఆర్డిఓ రాజేశ్వర్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, వేములవాడ దేవస్థానం అధికారులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.